S. J. Suryah: అరేయ్ పాపంరా.. అప్పుడు పాజిటివ్ అని.. ఇప్పుడు నెగిటివ్ అంటే ఎలా

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:06 PM

ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నప్పుడు ప్రశంసలతో ముంచెత్తినవారే.. పరాజయాలు వచ్చినప్పుడు విమర్శలను గుప్పిస్తారు.

S.J. Suryah

ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నప్పుడు ప్రశంసలతో ముంచెత్తినవారే.. పరాజయాలు వచ్చినప్పుడు విమర్శలను గుప్పిస్తారు. ఒకప్పుడు వారు ఉంటేనే సినిమా హిట్ అన్నవారు.. నాలుగు ప్లాప్స్ పడగానే వారివలనే సినిమా పోయింది అని చెప్పుకోస్తారు. ఇండస్ట్రీలో ఇవేమీ కొత్త కాదు. తాజాగా ఆ లిస్ట్ లోకి ఎస్. జె సూర్య (S.J. Suryah) కూడా చేరాడు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన విలక్షణమైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు ఎస్. జె సూర్య. కొన్ని సినిమాల్లో ఆయన పాత్రకు విమర్శకులు కూడా ప్రశంసలు అందించారు. అయితే ఒకప్పుడు దర్శకుడిగా, హీరోగా బ్లాక్‌బస్టర్లు ఇచ్చి, ప్రస్తుతం విలన్‌గా సంచలనం సృష్టిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాల సక్సెస్ రేట్ మాత్రం పూర్తిగా నిరాశపరుస్తోంది. దీంతో అప్పుడు ఆయనను పొగిడినవారే.. ఇప్పుడు విమర్శిస్తున్నారు.


నటుడిగా ఆయనకు విపరీతమైన పేరు వస్తున్నప్పటికీ, ఆయన విలన్‌గా చేసిన ప్రాజెక్ట్‌లు వరుసగా పరాజయం పాలవుతుండటంతో ఆయన చుట్టూ నెగెటివ్ సెంటిమెంట్ అల్లుకుంటోంది. ఇటీవల ఆయన ప్రతి నాయకుడిగా, నెగెటివ్ పాత్రల్లో కనిపించిన సర్దార్-2, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, గేమ్ చేంజర్, ఇండియన్-2, రాయన్ వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. ఆయన నటన పరంగా ఎంత ఆకట్టుకున్నా, సినిమాలు ఫ్లాప్ కావడంతో మేకర్స్ నడుమ ఈ సెంటిమెంట్ చర్చనీయాంశంగా మారింది అనే టాక్ నడుస్తోంది. సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ - నెల్సన్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ జైలర్-2లో బోధి అనే పవర్‌ఫుల్ పాత్రలో సూర్య నటిస్తున్నాడు.


నిజం చెప్పాలంటే.. ఏదైనా ఒకే లాంటి సినిమాలు ఎలా అయితే బోర్ కొట్టిస్తాయో.. ఒకేలాంటి పాత్రలు కూడా అలాగే బోర్ కొట్టిస్తాయి. ఇప్పుడు సూర్య విషయంలో కూడా అంతే. సూర్య నటనకు నెగిటివిటీ లేదు.. ఆయన ఎంచుకుంటున్న పాత్రలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. విలన్ గా ఒకే లాంటి పాత్రలు కావడంతో ఆయన చేసిన యాక్షన్.. అందరికీ ఓవర్ యాక్షన్ గా కనిపిస్తుంది. గతంలో ఆయన చేసిన పాత్రలు చలా విభిన్నంగా ఉండేవి. డాన్, మార్క్ ఆంటోనీ, సరిపోదా శనివారం... ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్.. డిఫరెంట్ లుక్స్ తో కనిపించడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్నీ విలన్ పాత్రలు ఒకేలా ఉండడంతో చూడలేకపోతున్నామని అంటున్నారు. ఏదిఏమైనా సూర్య.. ఇకనుంచి పాత్రల ఎంపికను కొంచెం ఆచితూచి ఎంచుకుంటే బావుంటుందని సలహాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం అరేయ్ పాపంరా.. అప్పుడు పాజిటివ్ అని.. ఇప్పుడు నెగిటివ్ అంటే ఎలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 06:06 PM