Black Gold: సినిమా విడుదల చేయాలంటే ఇన్ని అవరోధాలా?

ABN , Publish Date - Nov 14 , 2026 | 09:11 AM

'ఒక సినిమా తీసిన తర్వాత దాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ఇన్ని అవరోధాలు ఎదురవుతాయా? అంటూ నిర్మాత ఎంఎం. మూర్తి ప్రశ్నించారు.

'ఒక సినిమా తీసిన తర్వాత దాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ఇన్ని అవరోధాలు ఎదురవుతాయా? అంటూ నిర్మాత ఎంఎం. మూర్తి ప్రశ్నించారు. ఆయన నిర్మాణంలో రూపొందిన ‘బ్లాక్‌ గోల్డ్‌’ చిత్రం శుక్రవారం విడుదలైంది. అయితే, సినిమా విడుదలకు ముందు పాత్రికేయుల కోసం ప్రెస్‌ షో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత మూర్తి బోరున విలపిస్తూ కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆయన తేరుకుని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘ఇది నేను నిర్మించిన మొదటి చిత్రం. ఇప్పటివరకు నేను సంపాదించిన మొత్తం ఇందులో పెట్టుబడిగా పెట్టాను. ఈ సినిమా విడుదలకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా, రూపాయి ఆదాయం లేకుండా పెట్టుబడి వస్తే సరిపోతుందని భావించాను. కానీ, సినిమా విడుదలకు ముందు ఓ వ్యక్తి ఆదుకుంటానని మోసం చేశారు. ఆ తర్వాత ఈ సినిమాను విడుదల చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డాను. నేను డబ్బును నమ్మలేదు. కేవలం మనుషులను మాత్రమే నమ్మాను. అలా నమ్మిన మనుషులే మోసం చేయడం జీర్ణించుకోలేకపోయాను. అందుకే ఎమోషనల్‌కు లోనయ్యాను. చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించే నిర్మాతలు అనేక మంది నాతో తమ బాధలను పంచుకున్నారు.  సినిమాపై ఉన్న ఆసక్తితో వచ్చాను. గత మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నాను. అలాంటి నాకే ఈ సినిమా విడుదలకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఇపుడు మీడియానే సినిమాకు సపోర్టు చేసి, ఆదుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో వెట్రి, ప్రియాలయ, లివింగ్‌స్టన్‌, అభిరామి, ఏ.వెంకటేష్‌, రామర్‌, అరుల్‌ డి.శంకర్‌, సబిత రాయ్‌ తదితరులు నటించారు. ధీరన్ అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

Updated Date - Nov 14 , 2026 | 09:12 AM