Kollywood: అజిత్‌... వాట్ నెక్ట్స్!?

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:32 AM

అజిత్‌ తన కొత్త సినిమా ఇంతవరకూ ప్రకటించపోవడంతో కోలీవుడ్‌లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అజిత్‌ డిమాండ్‌ చేసిన పారితోషికాన్ని నిర్మాతలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంలేదనే వార్తలూ ప్రచారంలో ఉన్నాయి.

Ajith Kumar

బాక్సాఫీస్ బరిలో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) కు పోటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి విజయ్‌ (Vijay). వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగే వార్‌ చూస్తే గతంలో రజనీకాంత్‌ (Rajinikanth) - కమల్ హాసన్ (Kamal Hassan) అభిమానుల మధ్య జరిగిన గొడవలు గుర్తొస్తాయి. అయితే అజిత్ - విజయ్‌ ఫ్యాన్స్ మధ్య పోటీ అధికంగా సోషల్ మీడియా లోనే జరుగుతూ ఉంటుంది. అది మరీ వికటించినప్పుడు ఒకరిపై ఒకరు వాల్ పోస్టర్స్ వేసుకునే వరకూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్‌ నటనకు స్వస్తి చెప్పి, రాజకీయ పార్టీ పెట్టి, ఏకంగా తమిళనాడు సీఎం అయిపోయారు కాబట్టి... అజిత్‌కు సమ ఉజ్జీ చిత్రసీమలో లేరనే చెప్పాలి.

అందువల్లే అజిత్‌ తదుపరి చిత్రం ఏదనే విషయమై రకరకాల వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. గత యేడాది అజిత్‌ నటించిన రెండు సినిమాలు 'విడుమార్చి', 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' (Good Bad Ugly) బ్యాక్‌ టు బ్యాక్ విడుదలయ్యాయి. ఈ రెండు కూడా అజిత్‌ ఇమేజ్‌ కారణంగా ఓ మాదిరిగా ఆడాయి తప్పితే... ఘన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ సినిమాల ముందు, ఆ తర్వాత కూడా అజిత్‌ మోటర్ రేసింగ్‌ మీద దృష్టి పెట్టి భారత పతాకాన్ని విదేశీ గడ్డ మీద ఎగురవేయడానికి ప్రాధాన్యమిచ్చారు. అందులో సఫలం కూడా అయ్యారు. దాంతో ఆయన కొంతకాలంగా నటన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు సినిమా విడుదలై యేడాదిన్నర గడిచి పోయిన నేపథ్యంలో అజిత్‌ అభిమానులు ఆయన నుంచి సినిమాను ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకూ అజిత్‌ తన తదుపరి చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


ఇదే సమయంలో కోలీవుడ్ వరుస పరాజయాలను అందుకుంటున్న నేపథ్యంలో స్టార్ హీరోలకు పారితోషికం కాకుండా లాభాలలో వాటా ఇస్తామనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. అజిత్‌ మాత్రం దీనిపై ఆసక్తి చూపుతున్నట్టు లేదు. ఆయన తన రాబోయే చిత్రానికి 140 నుండి 180 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంత భారీ మొత్తం ఇచ్చే నిర్మాణ సంస్థలు తమిళనాడులో ప్రస్తుతం కనిపించడం లేదు. గతంలో సుదీర్ఘకాలం విజయకేతనం ఎగురవేసిన చాలా నిర్మాణ సంస్థలు ఇప్పుడు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నాయి. రెడ్ జెయింట్‌ స్టూడియోస్, ఏజీఎస్‌ ఎంటర్ టైన్ మెంట్స్, సన్ ఎంటర్ టైన్‌ మెంట్ వంటి కొన్ని సంస్థలే భారీ చిత్రాలను ఇప్పుడు నిర్మిస్తున్నాయి. లైకా వంటి సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో అజిత్‌కు అంత భారీ పారితోషికం ఇవ్వడానికి ఏ నిర్మాతా ముందుకు రావడం లేదని సమాచారం. అజిత్‌తో ఒకవేళ సినిమా తీస్తే... తమకూ ఆ స్థాయిలో లాభాలు రావాలని ప్రతి నిర్మాత కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు భారీ లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవేళ అజిత్‌ లాభాలలో వాటాకు అంగీకరిస్తే... ఆయనతో సినిమా చేయడానికి తమకు అభ్యంతరం లేదని కొందరు నిర్మాతలు సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. అజిత్‌తో 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్‌ రవిచంద్రన్ మరో సినిమా చేయడానికి సిద్థంగా ఉన్నాడు. అలానే గతంలో అజిత్‌లో సినిమాలు తీసిన చిరుతై శివ కూడా ఆసక్తి చూపుతున్నాడు. మరి ఈ కాంబినేషన్‌లో ఏ నిర్మాత అజిత్‌తో మూవీ మొదలు పెడతాడో చూడాలి. అయితే... అజిత్‌ సినిమాలో నటించడానికి పెద్దంత ఆసక్తి చూపడంలేదని, ఆయనకు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీ మొత్తమే అందుతోందని సన్నిహితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మెగా రికార్డ్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!

సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

Updated Date - Jun 16 , 2026 | 10:40 AM