తమిళ నిర్మాతల నిర్ణయం... ఆగిన షూటింగులు
ABN , Publish Date - May 03 , 2026 | 06:46 AM
తమిళ నిర్మాతల సంఘం పిలుపుతో ఒకరోజు సమ్మె జరిగింది. సూర్య, విశాల్, శింబు, విజయ్ సేతుపతి సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి.
తమిళ చిత్ర నిర్మాతల సంఘం శనివారం ఒక్క రోజు సినిమా షూటింగులను నిలిపివేసింది. ఈ కారణంగా సూర్య, విశాల్, శింబు, విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. నిర్మాతల లాభనష్టాల్లో హీరోలు పాలుపంచుకోవాలని, ఇకపై మధ్య, పెద్ద చిత్రాలను రెవెన్యూ షేరింగ్ విధానంలోనే నిర్మించాలంటూ ఇటీవల నిర్మాతల సంఘం తీర్మానించింది. ఈ విషయాల గురించి చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ తెలియజెప్పేలా, అవగాహన కల్పించడం కోసం ఒక రోజు సమ్మెకు నిర్మాతల సంఘం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అనేక సినిమాల షూటింగులు స్తంభించిపోయాయి.
ఈ విషయంపై నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్ కుమరన్, సంఘం నిర్వాహకులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గత నెల 26వ తేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు ఒక రోజు సమ్మె చేయడం జరిగింది. భవిష్యత్‌లో నిర్మించే చిత్రాల నిర్మాణంలో నిర్మాతలు నష్టపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్మాతలందరూ కోరుతున్నారు. ఈ సమ్మెకు పూర్తి మద్దతు ఇచ్చిన ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి సహా అన్ని సినీ నిర్మాణ కార్మికుల సంఘాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.