విజయ్‌.. ముందు త్రిషను వ‌దిలేసి రా!

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:17 AM

ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Vijay

ప్రముఖ సినీ నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత విజయ్‌పై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ కూటమిపై గతంలో విజయ్ చేసిన విమర్శలపై స్పందించిన నాగేంద్ర‌న్. విజయ్‌కు ఏమీ తెలియదు. అతనికి అనుభవం లేదు. ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడమనండి. దానికంటే ముందు అతను త్రిష (Trisha Krishnan) నుంచి దూరమై బయటకు వస్తేనే వాస్తవాలను గ్రహించగలడు' అని ఎద్దేవా చేశారు.

శుక్రవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో నాగేంద్రన్ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రయత్నించే ముందు అతను తన కుటుంబ సంబంధాలను సరిదిద్దుకోవాలని, తన కుటుంబంతో సత్సంబంధాలను కొనసాగించి, గొప్ప నాయకులు ఉద్యమాలు ఎలా నిర్మించారో తెలుసుకోవాలని సూచించారు. 'విజయ్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా ఉంది' అని అన్నారు.

'విజయ్ నటుడు కాబట్టి 32 శాతం ఓట్లు సాధిస్తారనుకుంటే ఎలా అంగీకరించగలం? విజయకాంత్ సభలకు కూడా ఒకప్పుడు భారీగా జనం రాలేదా? జన సమూహం ఓట్లుగా మారాలి కదా? అది అంత సులభం కాదు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. నాగేంద్రన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా విజయ్ నిత్యం విమర్శించే డీఎంకే నుంచి ఆయనకు అనూహ్య మద్దతు లభించింది. డీఎంకేకు చెందిన మహిళా ఎంపీలు కనిమొళి, తమిళచ్చి తంగపాండ్యన్ నాగేంద్రన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

జాతీయ పార్టీ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి మహిళలను ఉద్దేశించి ఇలా మాట్లాడటం సరికాదని, మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని వారు హితవు పలికారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న 'అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం' అధినేత టీటీవీ దినకరన్ కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన అలా మాట్లాడటం సరికాదని, రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచిం చారు. టీవీకేకు చెందిన సీనియర్ నేతలు ఏకే సెంగోట్టయ్యన్, నాంజిల్ సంపత్ మాట్లాడుతూ.. నాగేంద్రన్ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 10:39 AM