ఆర్‌కే సెల్వమణి: కోలీవుడ్‌లో నిర్మాతల కొరత
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:49 PM
తమిళ చిత్రపరిశ్రమ నిర్మాతల కొరత ఎదుర్కొంటోందని, ఇండస్ట్రీకి నిర్మాతలు కావాలని, ప్రముఖ దర్శకుడు, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి (RK Selvamani) అభిప్రాయం వ్యక్తం చేశారు.
తమిళ చిత్రపరిశ్రమ నిర్మాతల కొరత ఎదుర్కొంటోందని, ఇండస్ట్రీకి నిర్మాతలు కావాలని ప్రముఖ దర్శకుడు, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి (RK Selvamani) అభిప్రాయం వ్యక్తం చేశారు. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘లీడర్’ (leader). ఇది తమిళ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి చెన్నైలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో చిత్రపరిశ్రమకు చెందిన దిగ్గజ నిర్మాతలు కలైపులి ఎస్. థాను, టీజీ త్యాగరాజన్, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి వంటి ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు చెప్పారు.
ఈ వేడుకలో కొత్తగా తయారు చేసిన తెలుగు వెర్షన్ టీజర్‌ను విడుదల చేసిన తర్వాత ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ, ‘లెజెండ్’ శరవణన్ బంగారు బాతు వంటివారు. ఇలాంటి నిర్మాతలు చిత్రపరిశ్రమకు ఎంతో అవసరం. మున్ముందు అనేక చిత్రాల్లో హీరోలుగా నటించడమే కాకుండా, ఇతర హీరోలతో కూడా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
హీరో లెజెండ్ శరవణన్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రం కమల్ హాసన్ ‘విక్రమ్’, రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘లియో’ తరహాలో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాం. ఈ సినిమా చూసే ప్రేక్షకుడు వంద శాతం తృప్తితో థియేటర్ నుంచి బయటకు వస్తాడు. 2026లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, ఆండ్రియా జర్మియా హీరోయిన్లుగా నటించగా, ఇతర పాత్రల్లో శ్యామ్, సంతోష్ ప్రతాప్, టీవీవీ గణేష్, జార్జ్ మరియన్, లాల్ తదితరులు నటించారు.