సూర్య.. ఇలాంటివి ఆపేస్తే మంచిదేమో
ABN , Publish Date - May 15 , 2026 | 05:18 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)కు తెలుగులో మంచి బ్యాన్ బేస్ ఉంది. గజిని దగ్గర నుంచి జైభీమ్ సినిమాల వరకు ఆయన చేసే ప్రతి సినిమాలో ఒక కథ ఉంటుంది. ఆ కథ ప్రేక్షకులను థియేటర్ వద్దకు తీసుకెళ్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)కు తెలుగులో మంచి బ్యాన్ బేస్ ఉంది. గజిని దగ్గర నుంచి జైభీమ్ సినిమాల వరకు ఆయన చేసే ప్రతి సినిమాలో ఒక కథ ఉంటుంది. ఆ కథ ప్రేక్షకులను థియేటర్ వద్దకు తీసుకెళ్తుంది. కానీ, కొన్నేళ్లుగా సూర్య కథల ఎంపికలో తప్పు చేస్తున్నాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. ముఖ్యంగా తెలుగువారికి సూర్య దూరం అవుతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
2021 లో జైభీమ్ తరువాత సూర్యకు ఒక్క హిట్ లేదు. మధ్యలో విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా కనిపించినా అది కమల్ హాసన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత సూర్య నుంచి వచ్చిన ఈటీ, కంగువ, రెట్రో భారీ పరాజయాలను అందుకున్నాయి. అసలు ఇలాంటి కథలను సూర్య ఎలా ఒప్పుకున్నాడు అని చాలామంది పెదవి విరిచారు. ఇక ఈ ఏడాది కరుప్పు సినిమాతో సూర్య మంచి హిట్ కొడతాడు అని అనుకున్నా.. అది కూడా అటకెక్కినట్టే అని తెలుస్తోంది.
కొన్ని అనివార్య కారణాల వలన మే 14న రిలీజ్ అవ్వాల్సిన కరుప్పు మే 15 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. సరే తెలుగులో కూడా అలానే పాజిటివ్ టాక్ అందుకుంటుంది అనుకుంటే.. మిక్స్డ్ టాక్ ని అందుకొని బోల్తా పడింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. స్టోరీ లైన్ బానే ఉన్నా డైరెక్టర్ బాలాజీ చూపించిన విధానం సినిమాను తేలిపోయేలా చేసిందని అంటున్నారు. సాధారణంగా అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చిన హీరోకు దేవుడు సపోర్ట్ గా నిలబడడం చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ, ఇక్కడ దేవుడే ఒక మనిషిలా రావడం, అన్యాయాన్ని అరికట్టడానికి పోరాడడం బావుంది. కానీ, లాజిక్ లేకుండా మహిమలు చూపించి త్వరత్వరగా ముగించేయడం అంతగా నచ్చలేదని అంటున్నారు.
ముఖ్యంగా సినిమాకు ప్లస్ ఏదైనా ఉంది అంటే అది సూర్య మాత్రమే. లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నా కూడా.. అతనికి ధీటైన విలన్ ని దించకుండా ఆ పాత్రలో ఆర్జే బాలాజీ నటించడం పెద్ద మైనస్. ఏ స్టోరీ లైన్ తీసుకున్నా కూడా దానికి దేవుడిని యాడ్ చేయడం ఆర్జే బాలాజీ అలవాటు. ఇందులో అది కొంచెం ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. హీరోగా సూర్యకంటూ ఒక ప్రాధాన్యత లేదు. దేవుడు అంటే మహిమలు ఉంటాయి.. ఆయనను ఎవరు ఎదిరించలేరు అని అందరికి తెలుసు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు మదిలో అదే ఉంటుంది. అదే ఈ సినిమాకు మైనస్ గా మారింది. మాస్ యాక్షన్స్ బానే ఉన్నా .. కథ ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకుడికి విసుగొచ్చేస్తోందని చెప్పుకొస్తున్నారు. ఇక త్రిష క్యారెక్టర్ కూడా పెద్ద ఏం లేదని, ఇలాంటి కథలను సూర్య ఆపేస్తే బెటర్ అని చెప్పుకొస్తున్నారు. తమిళ్ తంబీలకు నచ్చినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం సహనానికి పరీక్ష అని అంటున్నారు. మరి సూర్య తన తదుపరి చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ తోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.