సూర్యతో వన్స్‌మోర్.. ఆ అదృష్టవంతులు ఎవరో
ABN , Publish Date - Sep 06 , 2026 | 09:13 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కెరీర్ ప్రస్తుతం ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కెరీర్ ప్రస్తుతం ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. గతంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, ఈ ఏడాది మాత్రం రెండు బ్యాక్-టు-బ్యాక్ హిట్స్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. పైగా ఒకే జోనర్ లో కాకుండా రెండు డిఫరెంట్ జోనర్స్ లో సూర్య సక్సెస్ సాధించారు. కరుప్పు (Karuppu) సినిమాతో మాస్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన, మరోవైపు విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons) చిత్రంతో క్లాస్ హిట్ సాధించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ జోరు చూస్తుంటే సూర్య ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం నెలకొందనే చెప్పాలి.
ప్రస్తుతం సూర్య చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆయన సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత సెన్సేషనల్ మూవీ జై భీమ్ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్‌తో మరోసారి చేతులు కలుపుతున్నారు. అంతేకాకుండా, ఖాకీ, తెగింపు, జననాయగన్ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన హెచ్. వినోద్‌తోనూ ఓ భారీ సినిమాకు రంగం సిద్ధమైంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పెద్ద ప్రాజెక్ట్‌లతో సూర్య బిజీగా ఉన్నారు. అయితే ఇన్ని సినిమాల మధ్య ఫ్యాన్స్‌లో అసలు సిసలు చర్చ మాత్రం ఆయన మైలురాయి చిత్రం గురించే జరుగుతోంది. సూర్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోయే 50వ సినిమాను ఏ దర్శకుడితో చేయబోతున్నారు..? అసలు ఆ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ ఎవరికి దక్కుతుంది..? అనే ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రేసులో ప్రధానంగా రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రతో సూర్య సృష్టించిన వైబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఒక్క పాత్రతోనే సినిమా రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు అదే రోలెక్స్ నేపథ్యంతో ఒక ఫుల్ కమర్షియల్ మాస్ యాక్షన్ మూవీని తెరకెక్కించాలని, అదే సూర్య 50వ సినిమా అయితే బాగుంటుందని అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్నారు.
అయితే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్‌లో బిజీగా ఉండటం గమనార్హం. మరోవైపు, ఈ ఏడాది సూర్యకు కరుప్పు రూపంలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆర్.జె. బాలాజీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కరుప్పు చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించాలని, ఆ క్రేజీ ప్రాజెక్ట్‌నే సూర్య ల్యాండ్‌మార్క్‌గా తీసుకురావాలని ఫ్యాన్స్ నుంచి భారీ డిమాండ్ వస్తోంది. ఈ రెండు ఆప్షన్స్‌లో ఏది నిజమవుతుంది? లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) రోలెక్స్ రూపంలో మాస్ ట్రీట్ వస్తుందా? లేదంటే ఆర్.జె. బాలాజీతో కరుప్పు సీక్వెల్ పట్టాలెక్కుతుందా? ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.