లోకేశ్.. అసలేం ఫ్లాన్ చేశావయ్యా
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:31 PM
సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’ తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో LCUలో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నారు. ఒకవైపు పక్కా మాస్ యాక్షన్ మూవీస్ చేస్తూనే.. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పిస్తూ తన మార్కెట్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఈ ఏడాది ఇప్పటికే 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. 'కరుప్పు' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టిస్తే.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో సూర్య స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.
ఈ ఊపులోనే సూర్య తన తదుపరి సినిమాలను పక్కా ప్లానింగ్‌తో లైనప్‌లో పెట్టారు. ప్రస్తుతం ఆయన 'ఆవేశం' మూవీతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో 'సూర్య 47' చేస్తున్నారు. ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీని తర్వాత 'జై భీమ్' లాంటి మైండ్ బ్లోయింగ్ హిట్ ఇచ్చిన టీజే జ్ఞానవేల్ కాంబినేషన్‌లో 'సూర్య 48' పట్టాలెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక సూర్య 49వ సినిమాకు హెచ్. వినోత్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో బాగా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు అసలు చర్చ అంతా సూర్య 50వ సినిమా గురించే జరుగుతోంది. సూర్య ల్యాండ్‌మార్క్ 50వ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (Lokesh Cinematic Universe) లో ప్రాచుర్యం పొందిన రోలెక్స్ (Rolex) క్యారెక్టర్ ఆధారంగా మూవీ అని తెలుస్తోంది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'విక్రమ్' మూవీ క్లైమాక్స్‌లో సూర్య కనిపించింది కేవలం కొన్ని నిమిషాలే అయినా.. క్రూరమైన డ్రగ్ లార్డ్ 'రోలెక్స్'గా ఆయన చూపించిన విరూపరూపం థియేటర్లలో పూనకాలు తెప్పించింది. అప్పటినుంచి ఈ పాత్రపై సోలో సినిమా రావాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
సరిగ్గా అభిమానుల కోరికకు తగ్గట్టుగానే లోకేష్ కూడా రోలెక్స్ పాత్రతో ఒక ఫుల్ లెంగ్త్ మూవీ చేయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై సూర్య స్వయంగా స్పందిస్తూ అప్‌డేట్ ఇచ్చారు. లోకేష్ ప్రస్తుతం రోలెక్స్ కథపై వర్క్ చేస్తున్నారని.. అయితే లోకేష్ కమిట్ అయిన ఇతర ప్రాజెక్ట్‌ల వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో చేయబోయే 'AA23' తో పాటు, 'ఖైదీ 2' సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు సూర్య చేతిలో కూడా వరుసగా మూడు సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరో రెండు నుంచి మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా, 'విక్రమ్'లో కొన్ని నిమిషాలకే రచ్చ లేపిన రోలెక్స్.. పూర్తి స్థాయి సినిమాలో వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం.