Sundar C: రజనీతో సినిమా.. నాకంత కెపాసిటీ లేదు
ABN , Publish Date - May 03 , 2026 | 03:49 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో సుందర్ సి (Sundar C) ఒకరు. హర్రర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుందర్ సి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Sundar C: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో సుందర్ సి (Sundar C) ఒకరు. హర్రర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుందర్ సి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈమధ్యనే ఆయన తలైవర్ 173 చిత్రం నుంచి ఆయన తప్పుకున్న విషయం తెల్సిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తోన్న ఈ సినిమాకి చాలామంది దర్శకత్వం వహిస్తోన్నట్లు వార్తలు వచ్చాయి. సీనియర్ డైరెక్టర్ నుంచి కుర్ర డైరెక్టర్ వరకు అందరి పేర్లు వినిపించాయి.
ఇక చివరగా ఆ ఛాన్స్ ను సుందర్ సి కొట్టేశారు. రజనీ, కమల్ అధికారికంగా సుందర్ సి నే తలైవర్ 173 కి డైరెక్టర్ అని కూడా ప్రకటించారు. అయితే అలా ప్రకటించిన మూడు రోజులకే తాను తలైవర్ 173 నుంచి తప్పుకుంటున్నట్లు సుందర్ సి తెలపడం సంచలనంగా మారింది. కానీ, సుందర్ సి.. రజనీ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారు అనేదాని గురించి రకరకాల కథనాలు వచ్చాయి.
తాజాగా సుందర్ సి.. తలైవర్ 173 నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ' నిజం చెప్పాలంటే రజనీ సినిమా చేయడం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పని. 16 ఏళ్ళుగా నా సినిమాలను నాకు నచ్చినట్లు తీసుకుంటూ వచ్చాను. కానీ, రజనీ సినిమా ఆలా కాదు. అందుకే తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. ఒక దశలో ఈ సినిమా తీసే కెపాసిటీ నాకు లేదనిపించింది. నాకు కథ చెప్పడం రాదు. చాలాసార్లు ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేక రాజీకి వచ్చేస్తా. ఇంత పెద్ద సినిమా నా ఒక్కడి చేతుల మీదగానే నడవదు. ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు సినిమాలోని భాగస్వామ్యులుతో నిజాయితీగా ఉండలేను. అందుకే తప్పుకున్నాను' అని తెలిపారు.