Veerappan Sukanya: వీరప్పన్.. ఇంటర్వ్యూ కేసు! 30 ఏళ్ల.. తర్వాత సుకన్యకు భారీ ఊరట
ABN , Publish Date - Jun 07 , 2026 | 10:55 AM
సీనియర్ నటి సుకన్యకు ఎట్టకేలకు న్యాయపరమైన ఉపశమనం లభించింది.
సీనియర్ నటి సుకన్య (Sukanya) కు ఎట్టకేలకు ఉపశమనం నటించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వీరప్పన్ (Veerappan) పరువు నష్టం ఇంటర్వ్యూ కేసులో రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఇచ్చిన దిగువ కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టు సమర్థించింది. వివాదం మొదలైన దాదాపు 30 ఏళ్ల తర్వాత వెలువడిన ఒక కీలక తీర్పులో, సన్ టీవీ (Sun TV ) నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా నటి సుకన్యకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు ₹10.01 లక్షల పరిహారాన్ని సమర్థించింది.
వివరాలలోకి వెళితే.. 1996లో సన్ టీవీలో ప్రసారమైన 'నెరుక్కు నెర్ అనే కార్యక్రమంలో వీరప్పన్ ఇచ్చిన ఇంటర్వ్యూలోతనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు ప్రసారమయ్యాయని ఆరోపిస్తూ నటి సుకన్య కోర్టును ఆశ్రయించారు.. ఈ నేపథ్యంలో 2015లో నాటి ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చి రూ.10.01 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ నెట్‌వర్క్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తాజాగా ట్రయల్ కోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా సన్ ఛానెల్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ, కంటెంట్‌ను ప్రసారం చేసే ముందు దాన్ని సరిచూసి, క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత మీడియా సంస్థలకు ఉందని హైకోర్టు పునరుద్ఘాటించింది. అసలు ఇంటర్వ్యూను ప్రసారం చేసే ముందు, కంటెంట్‌పై సన్ టీవీకి పూర్తి సంపాదకీయ నియంత్రణ ఉందని, అందులోని పరువు నష్టం కలిగించే భాగాలను తొలగించి లేదా సవరించి ఉండవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.