'సుదాని ఫ్రమ్ నైజీరియా' నటి.. సావిత్రి శ్రీధరన్ కన్నుమూత

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:11 PM

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి సావిత్రి శ్రీధరన్ కన్నుమూశారు.

Savithri Sreedharan

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి సవిత్రి శ్రీధరన్ (Savithri Sreedharan) కన్నుమూశారు. సెప్టెంబర్ 23న కోజిఖోడ్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. మరణ సమయానికి ఆమె వయసు 78 సంవత్సరాలు. సవిత్రి శ్రీధరన్ మృతితో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సుదాని ఫ్రమ్ నైజీరియా (Sudani from Nigeria) చిత్రంలో జమీలా పాత్రతో సవిత్రి శ్రీధరన్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అంతేగాక ఆ సినిమాకు గాను ఆమెకు కేరళ రాష్ట్ర ఉత్తమ క్యారెక్టర్ నటి అవార్డు దక్కింది. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కూడా స్పెషల్ జ్యూరీ మెన్షన్ అందుకోవడం విశేషం.

సినిమాలతో పాటు రంగస్థల కళాకారిణిగా కూడా సవిత్రి శ్రీధరన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. దశాబ్దాల పాటు నాటక రంగంలో సేవలందించిన ఆమె, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వయసు పైబడిన తర్వాత కూడా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

సవిత్రి శ్రీధరన్ మరణ వార్త తెలిసిన వెంటనే మ‌ల‌యాళ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో సంతాపం తెలియ‌జేస్తున్నారు. త‌ను న‌టించిన కొన్ని ప్ర‌ముఖ పాత్ర‌ల వీడియోలను షేర్ చేస్తున్నారు.

Updated Date - Sep 23 , 2026 | 04:11 PM