Suriya: నెగిటివ్ పోస్టులకు రియాక్ట్ కావొద్దు.. ఫ్యాన్స్‌కు సూర్య సూచన!

ABN , Publish Date - Sep 27 , 2026 | 02:43 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో కనిపించే అనవసరమైన చర్చలు, విమర్శలు, వివాదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)అభిమానులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో కనిపించే అనవసరమైన చర్చలు, విమర్శలు, వివాదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా నెగిటివ్ పోస్టులకు స్పందిస్తూ సమయం, శక్తిని వృథా చేసుకోవద్దని అభిమానులకు (Suriya Fans meet) హితవు పలికారు.  ఇటీవల తన అభిమాన సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సూర్య ఈ విషయాలపై మాట్లాడారు.  సోషల్ మీడియాలో ఎవరో ఒకరు తమ గురించి లేదా తమ అభిమానుల గురించి ఏదైనా వ్యాఖ్య చేస్తే వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎదుటివారిని మార్చడం మన చేతుల్లో ఉండదని, అయితే మన ప్రవర్తనను మాత్రం మనమే నియంత్రించుకోవచ్చని సూచించారు.  

‘‘ఎవరో సోషల్ మీడియాలో ఏదో రాశారని దానికి వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కూడా అదే విధంగా స్పందిస్తే మనకీ, వాళ్లకీ తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ దారిలో ఉండనివ్వండి. ఎదుటివారిని మార్చడం అంత సులభం కాదు. విమర్శలకు సమాధానాలు ఇస్తూ మీ సమయాన్ని, శక్తిని వృథా చేసుకోకండి. ప్రేమను పంచుతూ మీరు చేయాల్సిన పనిపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ మీ లక్ష్యం కోసం పనిచేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది’’ అని సూర్య పేర్కొన్నారు. ఇటీవల హీరో శివకార్తికేయన్ ‘సర్దార్ 2’, ‘మండాడి’ చిత్ర బృందాలను అభినందిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు సూర్య అభిమానుల్లో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చలను దృష్టిలో పెట్టుకునే సూర్య ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.  ఇటీవల  ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  చిత్రంతో   అలరించిన ఆయన.. తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కిస్తున్న ‘సీన్’ చిత్రంలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Updated Date - Sep 27 , 2026 | 05:05 PM