ఎన్నికల బరిలో నిలచిన సినీజనం
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:54 PM
తెలుగు నేలపైనా, తమిళనాడులోనూ ఎన్నికలొస్తే చాలు స్టార్స్ సందడే సందడి. ఎన్నికల్లో పోటీ చేస్తూ కొందరు - ప్రచారంలో మరికొందరు పదనిసలు పలికిస్తూ ఉంటారు. తాజాగా తమిళనాట జరిగే ఎన్నికల్లో పలువురు నోటెడ్ స్టార్స్ బరిలో ఉన్నారు.
ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోన్న ఎన్నికల్లో మెయిన్ స్టార్ ఎట్రాక్షన్ 'ఇళయ దళపతి' విజయ్ అనే చెప్పాలి. విజయ్ సొంతగా 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీని నెలకొల్పి తమిళనాడులోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థులను బరిలో నిలిపారు. తాను పెరంబూర్, తూర్పు త్రిచ్చి నుండి పోటీ చేస్తున్నారు. విజయ్ 'టీవీకే' పార్టీ అభ్యర్థులను ఓడించాలని డి.యమ్.కె., కాంగ్రెస్ కూటమి ఓ వైపు, మరోవైపు బీజేపీ, అన్నాడియమ్. కె. అలయన్స్ ప్రయత్నిస్తున్నాయి. అంటే రెండు ప్రధాన పార్టీలు విజయ్ పార్టీని మట్టికరిపించాలని ప్రయత్నిస్తూ ఉండడంతో అతని ఫ్యాన్స్ లో 'టీవీకే'ను గెలిపించాలన్న కసి పెరిగిందని తెలుస్తోంది.
అన్నా దొరై, కరుణానిధి కాలం నుంచీ తమిళ పాలిటిక్స్ లో సినీజనం ప్రముఖ పాత్ర పోషిస్తూనే ఉన్నారు. తరువాత యమ్జీఆర్, శివాజీగణేశన్, విజయ్ కాంత్, జయలలిత వంటి స్టార్స్ తమిళ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. కొందరు అనూహ్యంగా గెలిచారు. మరికొందరు పరవాలేదనిపించారు. ఇంకొందరు ఓటమిని చవిచూశారు. కమల్ హాసన్ సైతం గత ఎన్నికల్లో ఘోరపరాజయం మూటకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కరుణానిధి తనయుడు స్టాలిన్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్టాలిన్ కొడుకు ఉదయనిధి తండ్రికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం తమ డి.యమ్.కె. పార్టీ అభ్యర్థిగా చేపాక్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
టాప్ స్టార్స్, నోటెడ్ స్టార్స్ కాకుండా కొందరు కేరెక్టర్ యాక్టర్స్ సైతం తమిళ రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ సారి కూడా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు, ఖుష్బూ భర్త సుందర్. సి 'అన్నాడియమ్కే' అభ్యర్థిగా మదురై నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్నారు. 'నాన్ తమిళ కట్చి' పార్టీపై నటుడు, రాజకీయ నాయకుడు సీమాన్ ఈ సారి కారైకుడి నుండి బరిలో ఉన్నారు. విజయ్ పార్టీ తరపున తూత్తుకుడి నుండి ప్రముఖ తమిళనటుడు శ్రీనాథ్ బరిలో నిలిచారు. విజయకాంత్ నెలకొల్పిన డి.యమ్.డి.కె. పార్టీ టిక్కెట్ పై ఆయన తనయుడు విజయ్ ప్రభాకర్ - విరుదు నగర్ నియోజకవర్గం పోటీలో ఉన్నారు. 'లైకా' సంస్థ అధినేత తమిళ్ కుమరన్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పెన్ నగరం నుండి పోటీ చేస్తున్నారు. ఇక ప్రముఖ విలన్, కేరెక్టర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ ఎన్నికల్లో తరచూ పోటీ చేస్తూంటారు. గత ఎన్నికల్లో వెల్లూరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఆయన ఇండిపెండెంట్ గా లాల్ గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మన్సూర్. మరి వీరిలో ఎందరు సినిమావాళ్ళు చట్టసభకు ఎన్నికవుతారో చూడాలి.