ఇటు టాక్సిక్‌.. అటు ధురంధర్! ! నిలిచేదెవ‌రో.. ఓడేదెవ‌రో

ABN , Publish Date - Feb 20 , 2026 | 07:56 AM

మార్చిలో రెండు పాన్ ఇండియా మూవీస్ మధ్య వార్ సాగనుంది. అందులో ఒకటి నార్త్ ప్రాజెక్ట్ కాగా, మరోటి సౌత్ సినిమా. ఈ రెండూ క్రేజీ పిక్చర్స్ ఒకే రోజున రిలీజ్ అవుతూ ఉండడం విశేషం. రెండూ తగ్గేదే లే అంటూ బరిలోకి దూకనున్నాయి. మరి పైచేయి ఎవరిదో.?

Toxic Movie dhurander

అంతకుముందు 'కేజీఎఫ్' సిరీస్‌తో కన్నడ స్టార్ హీరో యశ్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఇక బాలీవుడ్‌లో ఎంతో పేరున్న రణవీర్ సింగ్ గత సంవత్సరం 'ధురంధర్' గ్రాండ్ సక్సెస్ తో దేశమంతటా సినీ ఫ్యాన్స్ ను ఆకర్షించారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాలు మార్చి 19వ తేదీన రిలీజ్ అవుతూ సినీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రణవీర్ సింగ్ ను వెయ్యి కోట్ల క్లబ్ లో నిలిపిన 'ధురంధర్' మూవీకి సీక్వెల్ గా 'ధురంధర్-2' చిత్రం వస్తోంది. అదే రోజున యశ్ హీరోగా రూపొందిన 'టాక్సిక్ - ఏ ఫేరీ టేల్ ఫర్ గ్రోనప్స్' రిలీజ్ అవుతోంది. ఓ సౌత్ పాన్ ఇండియా మూవీతో నార్త్ పాన్ ఇండియా పిక్చర్ పోటీపడుతూ ఉండడంతో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది.

యశ్ 'టాక్సిక్'తో రణవీర్ సింగ్ 'ధురంధర్-2' పోటీ పడుతూ ఉండడం విశేషమే. నార్త్ పాన్ ఇండియా మూవీస్ తో సౌత్ పాన్ ఇండియా పిక్చర్స్ ఢీ కొన్న సందర్భాలున్నాయి. అంతెందుకు యశ్ తన 'కేజీఎఫ్-1'తో 2018 డిసెంబర్ 21వ తేదీన ఏకంగా షారుఖ్ ఖాన్ 'జీరో'తో పోటీపడ్డారు. 'జీరో' పరాజయం పాలయింది. 'కేజీఎఫ్ -2' విడుదలైన 2022 ఏప్రిల్ 14వ తేదీన తెలుగువారి హిందీ సినిమా 'జెర్సీ', మరో హిందీ చిత్రం 'ఆపరేషన్ రోమియో' రిలీజయ్యాయి. అప్పుడు కూడా 'కేజీఎఫ్-2'దే పైచేయిగా నిలచింది. 'కేజీఎఫ్' సిరీస్ తరువాత యశ్ హీరోగా వస్తోన్న సినిమా 'టాక్సిక్'. అందువల్ల ఈ సారి యశ్ బాలీవుడ్ మూవీ 'ధురంధర్-2'తో ఎలా తలపడతాడో అన్న ఆసక్తి ఉత్తరాదిన సైతం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 'టాక్సిక్', అటు 'ధురంధర్-2' ప్రచారం మోత ఉంటుందని అందరూ భావించారు. అయితే మార్చి 19వ తేదికి పట్టుమని నెల రోజులు కూడా సమయం లేదు. అయినా ఈ రెండు చిత్రాల ప్రచారం ఊపందుకోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

toxic.jpg

'టాక్సిక్' సినిమా 600 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో కియార అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ వంటి అందాల తారలు నటించారు. అంతేకాదు టోవినో థామస్ వంటి మళయాళ స్టార్ కూడా ఉన్నారు. అందువల్ల 'టాక్సిక్'ను ఎలా ఉన్నా చూసేస్తారన్న ధీమా మేకర్స్ లో ఉంది. ఇక గత యేడాది 'ధురంధర్' ఏకైక వెయ్యి కోట్ల చిత్రంగా నిలచింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కారణంగా 'ధురంధర్-2'కు కూడా ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లే! ఎందుకంటే 'ధురంధర్' రెండు భాగాలు కలిపి 475 కోట్ల వ్యయం అయిందని బాలీవుడ్ టాక్. ఒకే రోజున పాన్ ఇండియా మూవీస్‌గా వస్తోన్న 'టాక్సిక్', 'ధురంధర్-2' లో ఏ సినిమాది పైచేయి అవుతుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే పెట్టుబడి - రాబడి లెక్కలు వేస్తే 'ధురంధర్-2' కే పై చేయి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమవుతుందో చూడాలి మరి.

Updated Date - Feb 20 , 2026 | 08:13 AM