Santosh Sobhan: వేలంటైన్స్ డే కానుకగా 'కపుల్ ఫ్రెండ్లీ'
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:17 PM
సంతోష్ శోభన్, మానసా వారణాసి జంటగా నటించిన సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. అశ్వన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న రాబోతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు తెరకెక్కించే చిన్న సినిమాలు సైతం ఎందుకు సంవత్సరాల తరబడి సెట్స్ మీదనే ఉంటాయో అర్థమే కాదు. అనుకున్న విధంగా ప్రాడక్ట్ రాకపోవడమో, ఊహించని అవాంతరాలో లేక నిర్మాతల సాచివేత ధోరణో... ఏదో కారణంగా కొన్ని సినిమాలు విడుదలకు యేళ్ళు పడుతుంటుంది. సంతోష్ శోభన్ (Santhosh Sobhan) హీరోగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly) విషయంలోనూ అదే జరిగింది.
సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా 'కపుల్ ఫ్రెండ్లీ' 2024లో మొదలైంది. మానస వారణాసి (Manasa Varanasi) ఇందులో హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. అశ్విన్ చంద్రశేఖర్ (Ashwin Chandrasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ (Aditya Ravindran) సంగీతం అందించాడు. గత యేడాది మార్చి 17న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కథకు తగ్గట్టుగా దీనిని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. గత కొన్నేళ్ళుగా సంతోష్ శోభన్ నటించిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. దాంతో అతను ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా అయినా సంతోష్ శోభన్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
