తెలుగులో మలయాళ 100 కోట్ల సినిమా!

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:22 PM

ఈ యేడాది సంక్రాంతి కానుకగా సాహు గారపాటి నిర్మించిన 'మన శంకర వరప్రసాద్‌ గారు' (Mana Shankara Varaprasad Garu) మూవీ రూ. 400 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఆయన మలయాళంలో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'వాజా 2' మూవీ వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకుంది.

Vaaza 2 Movie

మలయాళ చిత్రసీమ పరిమితమైన బడ్జెట్‌లో సినిమాలను నిర్మిస్తూ... భారీ విజయాలను నమోదు చేసుకుంటోంది. విశేషం ఏమంటే... కాన్సెప్ట్ బేస్డ్‌గా తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలు అవలీలగా వందకోట్ల క్లబ్‌లో చేరిపోతున్నాయి. స్టార్స్ హడావుడి, పబ్లిసిటీ గిమ్మిక్స్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల మనుసుల్ని దోచుకుంటున్నాయి, థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తున్నాయి. దానికి తాజా ఉదాహరణ 'వాజా 2' (Vaazha 2) సినిమా. ప్రముఖ తెలుగు నిర్మాత సాహూ గారపాటి (Sahu Garapati) ఈ మలయాళ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. పర్ ఫెక్ట్ ప్లానింగ్‌తో వేగంగా మేకింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలైంది. కేవలం వారం రోజుల్లోనే 'వాజా 2' వంద కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. చదువు పెద్దగా అబ్బని నలుగురు కుర్రాళ్ళ స్నేహానికి సంబంధించిన చిత్రమిది. పాఠశాల దశలో వేస్ట్ బ్యాచ్‌ అనిపించుకున్న వీళ్ళు ఎలాగొలా చదువును పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో పడతారు. మనదేశంలోనే కాకుండా దుబాయ్‌, యూకే కు వెళ్ళి అక్కడైన స్థిరపడానికి నానా తిప్పలూ పడతారు. విదేశాల్లో మన యువత పడే ఇబ్బందులను, కుటుంబ అనుబంధాలను సహజత్వానికి దగ్గరగా దర్శకుడు సవిన్‌ ఎస్.ఎ. తెరకెక్కించాడు. దాంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.


మూడు చాప్టర్లుగా సాగే ఈ సినిమాలో వినోదానికి పెద్ద పీట వేయడంతో పాటు ఎమోషన్ సీన్స్ కూడా మరీ భారీగా లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌ సీన్, థియేటర్ సీన్స్ కు మంచి అప్లాజ్‌ లభిస్తోంది. ఓ చిన్న రివేంజ్‌ డ్రామా కూడా ఇందులో దర్శకుడు జత చేయడంతో ఓ కంప్లీట్‌ మూవీని చూసిన భావనకు ప్రేక్షకులకు లోనవుతున్నారు. ఈ మలయాళ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి... దీనిని అతి త్వరలోనే తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ యేడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సాహు గారపాటి మూవీ 'మన శంకర వరప్రసాద్‌ గారు' రూ. 400 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి, సీనియర్‌ స్టార్ హీరోల చిత్రాలలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పుడు సాహు నిర్మాణ భాగస్వామిగా ఉన్న 'వాజా 2' కూడా వంద కోట్లు వసూలు చేయడం విశేషం. మరి ఈ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Apr 09 , 2026 | 01:41 PM