రేణుకాస్వామిని తప్పించే ప్రయత్నం చేశా.. కానీ దర్శన్ అలా చేశాడు! అప్రూవర్.. ప్రదోశ్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:12 AM
రేణుకాస్వామి హత్య కేసులో ఏ4 నిందితుడు ప్రదోశ్ అప్రూవర్‌గా మారేందుకు పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి (Renukaswamy) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ప్రదోశ్ (Pradosh) అప్రూవర్‌గా మారేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్‌లో నటుడు దర్శన్ (Darshan) కు వ్యతిరేకంగా పలు తీవ్రమైన ఆరోపణలను పిటిషన్ ద్వారా కోర్టుకు సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు, తాను ఈ కేసులో ఇరుక్కోవడానికి దర్శన్ ఒత్తిడే కారణమని ఆయన ఇటీవల కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. హీరో దర్శన్ మొదట రేణుకాస్వామిని దూషించి ఆ తర్వాత కొట్టారని అంతేగాక చెప్పుతో కొట్టాలని పవిత్రగౌడకు దర్శన్ సూచించినట్లు ప్రదోశ్ ఆరోపించారు. అయితే రేణుకా స్వామిని హత్య చేయాలనే ఉద్దేశం తనకు లేదని, అక్కడ ఉన్న కొందరు రేణుకాస్వామిని చంపాలని నిర్ణయించుకున్నారని, దాడిని ఆపేందుకు తాను ప్రయత్నించినా ఎవరూ తన మాట వినలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సంఘటన సమయంలో రేణుకాస్వామికి భోజనం, నీరు ఇచ్చింది తానేనని.. అనంతరం రేణుకాస్వామి మొబైల్ ఫోన్‌ను తీసుకుని పరిశీలించగా మరిన్ని వివరాలు బయటపడ్డాయని ప్రదోశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ప్రదోశ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే వీరి అభ్యర్థనలను కోర్టు అంగీకరించాల్సి ఉంది. కోర్టు అనుమతి లభిస్తే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రదోశ్ పిటిషన్‌లో చేసిన ఆరోపణలు నిజమని కోర్టు ఇంకా నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం, పిటిషన్‌లోని అంశాలు కేసు దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియలో ఎంతవరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలతో ఈ కేసు మరోసారి తీవ్ర చర్చకు దారితీయగా దర్శన్‌కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.