Sridevi Family Property Case: శ్రీదేవి కుటుంబానికి హైకోర్టులో ఊరట.. ఆస్తి వాటా పిటిషన్ కొట్టివేత

ABN , Publish Date - May 08 , 2026 | 06:34 AM

శ్రీదేవి కుటుంబం 37 ఏళ్లుగా అనుభవిస్తున్న 27 ఎకరాల భూమిపై వాటా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ కపూర్‌కు ఊరట లభించింది.

Sridevi, Boney Kapoor

దాదాపు నాలుగు దశాబ్దాలుగా దివంగత నటి శ్రీదేవి (Sridevi) కుటంబం అనుభవిస్తున్న ఆస్తిలో తమకు భాగం కావాలని కోరుతూ ముదలియార్ కుమారుడు చంద్రశేఖరన్ రెండో భార్య కుమారుడు నటరాజన్, అతని కుమార్తె శివగామి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు (Madras High Court) కొట్టివేసింది. 37 యేళ్ళ క్రితం కొనుగోలు చేసిన ఆస్తిలో ఇపుడు వాటా కావాలని కోరడం పిటిషనర్లకు తగదంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. 1988లో శ్రీదేవి ఫ్యామిలీ చెన్నై ఈసీఆర్ రోడ్డులో 27 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 37 యేళ్ళుగా ఆ ఆస్తి శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది.

ఈ నేపథ్యంలో నటరాజన్, శివగామి చెంగల్పట్టు మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని తిరస్కరించాలని కోరుతూ శ్రీదేవి భర్త బోనీ కపూర్ (Boney Kapoor), కుమార్తెలు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Khushi Kapoor) పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ కోర్డు.. పిటిషన్‌పై లోతుగా విచారణ జరిపిన తర్వాత ఆస్తి యాజమాన్యంపై తుది నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.

దీంతో బోనీ కపూర్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. గత 37 యేళ్ళుగా అనుభవిస్తున్న ఆస్తిని నకిలీ వారసత్వ ధ్రువ పత్రాల ద్వారా ఆస్తిపై యాజమాన్యం కోరుతూ ఇప్పుడు కేసు వేశారని, అందువల్ల చెంగల్పట్టు మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటీషన్‌ను కొట్టివేయాలని కోరారు. దీనిపై జస్టిస్ టీవీ తమిళ్సెల్వి విచారణ జరిపి.. శ్రీదేవి కుటుంబ ఆస్తిలో వాటా కోరుతూ నటరాజన్, శివగామి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే, గతంలో చెంగల్పట్టు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.

Updated Date - May 08 , 2026 | 07:11 AM