ఐదు భాషల్లో విడుదల.. నిత్యామీనన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రారంభం
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:25 AM
నటి నిత్యామీనన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
నటి నిత్యామీనన్ (Nithya Menen) ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీకే, విక్రమ్ కె.కుమార్‌తో కలిసి తొలుత ఆమె ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నిర్మించబోయే మొదటి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు ఆమె. ఈ సినిమాకు డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. గతంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియో విజన్, హీరోయిన్ నిత్యామేనన్‌కు చెందిన కేయురి ప్రొడక్షన్స్ కలిసి 'ప్రొడక్షన్ నెం.5' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు.
ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీలో నిత్యామేనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతి అందించేలా ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని, త్వరలోనే టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తామని అన్నారు. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో అందరూ ప్రేమలో పడతారు’ అని పేర్కొన్నారు. కాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.