RB Choudhary: అగర్‌బత్తీ వ్యాపారం నుంచి.. వంద సినిమాల నిర్మాణం

ABN , Publish Date - May 06 , 2026 | 07:36 AM

1980వ దశకంలో తన సినీ నిర్మాణ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆర్‌బీ చౌదరి లేరనే వార్త కోలీవుడ్‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

RB Choudhary

దిగ్గజ నిర్మాత, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్ (Super Good Films) అధినేత ఆర్‌.బి.చౌదరి(74) (RB Choudhary) ఇకలేరు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయన పూర్తి పేరు రతన్‌లాల్‌ భగవత్‌రామ్‌ చౌదరి. అనేక మంది కొత్త దర్శకులకు ఆయన అవకాశాలు కల్పించి, ఓ గుర్తింపునిచ్చారు. తమిళంతోపాటు, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఎన్నో హిట్‌ చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం విశాల్‌ హీరోగా ‘మకుటం’ పేరుతో తన 99వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విశాల్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కాకినాడలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్‌ కోసం చెన్నైకు వచ్చింది. ఇంతలోనే ఆయన లేరనే వార్త కోలీవుడ్‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. 1980వ దశకంలో తన సినీ నిర్మాణ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆర్‌బీ చౌదరి.. చిత్ర పరిశ్రమలో 40 యేళ్ళుగా కొనసాగుతున్నారు. విక్రమన్‌, కేఎస్‌ రవికుమార్‌, ఎస్‌.ఎళిల్‌, రాజకుమరన్‌, శశి, బాల శేఖరన్‌, బృందా సారథి, రవి మారియా వంటి 34 మంది దర్శకులను ఆయన చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు.


విజయ్‌తో.. వందో చిత్రానికి ప్లాన్‌

ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకె పార్టీ అధినేత విజయ్ (Vijay) కెరీర్‌ తొలినాళ్ళలో ‘పూవే ఉనక్కాగ’ (1996), ‘లవ్‌టుడే’ (1997), ‘తుళ్ళాద మనముమ్‌ తుళ్ళుమ్‌’ (1999), ‘షాజహాన్‌’ (2001), ‘తిరుప్పాచ్చి’ (2005), ‘జిల్లా’ (2014) వంటి చిత్రాలను తీశారు. తన నూరవ చిత్రాన్ని కూడా విజయ్‌తోనే తీయాలని ప్లాన్‌ చేశారు.

అగర్‌బత్తీ వ్యాపారం నుంచి..

1950లో మద్రా్‌సలో జన్మించిన చౌదరి స్వస్థలం రాజస్థాన్‌. సినిమాల్లోకి రాకముందు ఆయన అగర్‌బత్తీలతో పాటు స్టీల్‌, జ్యూవెలరీ వ్యాపారాలను చేశారు. చిత్ర నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించకముందు అనేక వ్యాపారాలు చేసి ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆర్‌బీ చౌదరి.. సినిమాపై ఉన్న వ్యామోహం, ఆసక్తి కారణంగా నిర్మాతగా, పంపిణీ దారుడుగా, సినీ ఫైనాన్షియర్‌గా రాణించారు. తొలిసారిగా ఆయన నిర్మించిన చిత్రం ‘ఆదిపాపమ్‌’ (మలయాళం) 1988లో విడుదలైంది. ఆ తర్వాత 1990లో తమిళంలో తీసిన ‘పుదువసంతం’ మూవీ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. తెలుగులో చౌదరి నిర్మించిన తొలి సినిమా ‘కెప్టెన్‌’. ఆయన కుమారులు జీవా, జితన్‌ రమేశ్‌ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

తెలుగులో.. క్లాసిక్‌ హిట్స్‌

తెలుగులో కూడా ఆయన పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించారు. వెంకటేశ్‌, నాగార్జున, పవన్‌కల్యాణ్‌, రాజశేఖర్‌ తదితర హీరోలతో తెలుగు ప్రేక్షకులకు ఆర్‌బీ చౌదరి అందించిన క్లాసిక్‌ హిట్స్‌లో ‘సుస్వాగతం, ‘రాజా’, ‘శీను’, ‘సంక్రాంతి’, ‘సూర్యవంశం’, ‘నువ్వొస్తావని’, ‘నవ వసంతం’ ‘సింహరాశి’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘అన్నవరం’, ‘గోరింటాకు’, ‘భీమిలి’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ సంగీత పరంగా కూడా పేరొందాయి.

Updated Date - May 06 , 2026 | 08:08 AM