వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే ఖబడ్దార్!

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:16 PM

గత కొన్నేళ్ళుగా తనపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి రశ్మిక మందన్న ఫైర్ అయ్యారు. ఓ వ్యక్తిగత సంభాషణను వెలుగులోకి తీసుకొచ్చి తనకు, తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Rashmika Mandanna

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), రశ్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం జరిగి పట్టుమని పదిహేను రోజులు కూడా కాకముందే ఆమె ఆనందాన్ని హరించే పనిని కొందరు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ వ్యక్తిగత సంభాషణను ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఎనిమిది సంవత్సరాలుగా కొన్ని మీడియా వర్గాలు, సోషల్ మీడియాలోని ఇన్ ఫ్లుయెన్సర్స్ తనను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని ఆమె వాపోయారు. తాను చేయని వ్యాఖ్యలను కూడా తనకు అంటగట్టి మానసిక క్షోభకు గురిచేశారని, అయినా తాను సహనంతో భరించానని అన్నారు. వారి వ్యూస్, రీచ్, ఎంగేజ్మెంట్ కోసం ద్వేషాన్ని ప్రచారం చేశారని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా తనతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న వారిని, ఈ వ్యవహారంతో సంబంధం లేని వారిని సైతం లాగి, వారికి అసౌకర్యం కలిగిస్తున్నారని రశ్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రకటన వెలువడిన దగ్గర నుండి 24 గంటలలోగా అన్ని రకాల మీడియా ప్లాట్ ఫారమ్స్ ఈ దుష్ప్రచారాన్ని తొలగించాలని, లేకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.


రశ్మిక ఇంతగా ఆవేదన చెందడం వెనుక ఓ ప్రధాన కారణం ఉంది. రశ్మిక సినిమా రంగానికి వచ్చిన కొత్తలో ఆమెకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో వివాహ నిశ్చితార్థం జరిగింది. అదే సమయంలో ఆమె విజయ్‌ దేవరకొండ సరసన 'గీత గోవిందం' సినిమాలో నటించారు. అందులో విజయ్‌తో సన్నిహిత సన్నివేశాలలో నటించడాన్ని రక్షిత్ శెట్టి కుటుంబ సభ్యులు విమర్శించారని, తమని క్షమాపణలు చెప్పమని కోరారని రశ్మిక తల్లి సుమన్ మందన్న ఒకరితో మాట్లాడుతూ వాపోయారు. ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం పెరిగి పెద్దది కావడంతో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అయితే అప్పటి ఆడియో క్లిప్పింగ్‌ను ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చి, కొందరు దానిని ప్రసారం చేశారు. సుమన్ మందన్న మాటల్లోని నిజానిజాల సంగతి పక్కన పెడితే... ఎప్పుడో జరిగిన ఓ విషయాన్ని అసందర్భంగా ఇప్పుడు ప్రసారం చేయడం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం సరైనది కాదని రశ్మిక మందన్న భావించారు. దాంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, దానికి బాధ్యులైన వారిని హెచ్చరించారు. మరి ఆమె హెచ్చరికలను మీడియా వర్గాలు ఏ మేరకు సీరియస్‌గా తీసుకుని ఆ సమాచారాన్ని తొలగిస్తారో చూడాలి.

Updated Date - Mar 12 , 2026 | 05:18 PM