ధర్మాన్.. రజినీతో సమానంగా రామ్ పాత్ర
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:39 PM
సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు అశ్విత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ధర్మాన్.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు అశ్విత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ధర్మాన్. ఈ సినిమా ప్రస్తుతం అటు కోలీవుడ్ ని.. ఇటు టాలీవుడ్ ని ఊపేస్తోంది. దానికి కారణం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడమే. ఒకపక్క హీరోగా, డైరెక్టర్ గా సినిమా చేస్తూనే.. ఇంకోపక్క రజనీకాంత్ సినిమాలో నటించడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ధర్మాన్ లో కనిపించనున్నారని టాక్.
ఇక ధర్మాన్ లో రామ్ నటిస్తున్నాడు అన్న వార్త తెలిసిన దగ్గర నుంచ్చ ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా వైరల్ గా మారుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్.. రజనీకాంత్‌తో సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడట. రజనీకాంత్, రామ్ మధ్య ఉండే సన్నివేశాలు మామ - అల్లుడు మధ్య జరిగే పవర్‌ఫుల్ ఫేస్-ఆఫ్‌లా నిలవనున్నాయని టాక్. రెండు వేర్వేరు తరాలకు చెందిన ఈ ఇద్దరు మాస్ హీరోల మధ్య వచ్చే ఘట్టాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.
ఈ సినిమాలో రామ్ పోతినేని నటనతో పాటు తన డ్యాన్స్ ప్రతిభను కూడా నెక్స్ట్ లెవెల్‌లో చూపించబోతున్నాడట. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన సంగీతంలో రామ్‌కి ఏకంగా 3 పాటలు ఉన్నాయని, అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఆయన వేసే మాస్ డ్యాన్స్ సీక్వెన్సెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. పాన్ -ఇండియా స్థాయిలో తన నటన, డ్యాన్స్, మాస్ అపీల్‌ను చాటుకోవడానికి రామ్‌కి ఇది ఒక సరైన అవకాశంగా మారనుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అశ్విత్ మారిముత్తు ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నారు. రజనీకాంత్ అరాచకమైన మాస్ ఇమేజ్, రామ్ ఎనర్జీ, అనిరుధ్ మ్యూజిక్ మిళితమై వస్తోన్న ధర్మాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.