ఆగ‌స్టులో జైల‌ర్‌2.. స్పెష‌ల్ కామియో ఎవ‌రు చేశారంటే?

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:53 PM

రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటోన్న ‘జైలర్‌ 2’ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది.

Rajinikanth Jailer 2

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘జైలర్‌ 2’ (Jailer 2) చిత్రం ఎట్టకేలకు షూటింగ్‌ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సెట్‌లో సంబరాలు జరుపుకుంది. భారీ కేక్‌ కట్‌ చేసి వేడుకను నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అలప్పరై కిలప్పరోమ్‌..తలైవరుమ్‌ నెరంధరం అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో రజనీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ సినిమాలోనూ శివరాజ్‌ కుమార్‌ ప్రత్యేక పాత్రలో కనిపించ నున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పూర్తవడంతో ఇప్పుడు అందరి దృష్టి విడుదల తేదీపై పడింది. అయితే గతంలో రజనీకాంత్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ ఏడాది జూన్‌ 12న విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. కానీ, ప్రస్తుతం వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉంటే.. జైల‌ర్ 1 సినిమాను 2023లో ఆగ‌స్టు 10న విడుద‌ల చేయగా, సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీంతో ఇప్పుడు తిరిగి మూడేండ్ల త‌ర్వాత ఆగ‌స్టులోనే రిలీజ్‌ చేస్తే క‌లిసి వ‌స్తుంద‌ని అభిప్రాయ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే.. సినిమాలో ఉండబోయే హై-ప్రొఫైల్ కామియో గురించి గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పేర్లు గట్టిగా వినిపించడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆపై ఆ వార్త‌లన్నీ అవాస్త‌వం అని తేల‌డంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ ప‌డ్డారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ సీక్రెట్ కామియో షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా, ఈసారి కూడా మోహన్‌లాల్ (Mohanlal) నే ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మొదటి ‘జైలర్’లో మోహన్‌లాల్ చేసిన చిన్న పాత్రే భారీ ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు అదే నటుడిని మళ్లీ కామియో కోసం తీసుకోవడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే స్పెష‌ల్ పాత్ర‌లో ఒక‌సారి క‌నిపించిన న‌టుడిని మరోసారి అదే త‌ర‌హా కామియోలో చూపించడం వల్ల ప్రెడిక్టబుల్‌గా అనిపించే అవకాశం ఉందని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

కాకపోతే.. పాత్ర‌ల‌ను స్టైలిష్‌గా, ఓ రేంజ్‌లో చూపిస్తాడ‌నే పేరున్న నెల్సన్ ఈసారి మోహన్‌లాల్ పాత్రను ఎలా డిజైన్ చేశాడో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మోహ‌న్ లాల్‌ రోల్ పెద్దగా ఉంటుందా? లేక కథలో కొత్త యాంగిల్ ఏమైనా తెరపైకి తీసుకువస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఈ కామియో చుట్టూ క్రేజ్ మాత్రం మరింత పెరిగిపోయింది.

Updated Date - Apr 22 , 2026 | 02:27 PM