Rajinikanth: 'ఒరేయ్.. శివాజీ' అని పిలుస్తుంటే పొంగిపోతా

ABN , Publish Date - Jan 23 , 2026 | 06:29 AM

మన స్నేహితులు ఎంతో ప్రేమగా 'రేయ్', 'ఒరేయ్' అంటూ పిలిచే పిలుపు వింటే ఎంతో సంతోషం వేస్తుందని తమిళ సూపర్ స్టార్‌ రజనీ కాంత్ అన్నారు.

Rajinikanth

మన స్నేహితులు ఎంతో ప్రేమగా 'రేయ్', 'ఒరేయ్' అంటూ పిలిచే పిలుపు వింటే ఎంతో సంతోషం వేస్తుందని తమిళ సూపర్ స్టార్‌ రజనీ కాంత్ (Rajinikanth) అన్నారు. కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 1975-79 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రజనీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'పాత స్నేహితులను చూడగానే కలిగే సంతోషం వర్ణించలేనిది. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన మీరంతా సుమారు 50 యేళ్ళ తర్వాత కలుసుకున్నారు. పెద్ద వారైన మీరంతా భర్త, తండ్రి, తాత, సర్, మచ్చాన్ ఇలా పలు విధాలుగా గౌరవంగా పిలుచుకున్నప్పటికీ, పాత స్నేహితులు మనల్ని పేరు పెట్టి, ఒరేయ్, రేయ్ అంటూ పిలిచే పిలుపు ఎక్కడ లేని సంతోషాన్నిస్తుంది.

నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బెంగుళూరు వెళ్ళి నాతో కలిసి పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లను కలుసుకుంటాను. శివాజీ అనే నా ఒరిజినల్ పేరును నేను మరిచిపోయాను. కానీ, నా స్నేహితులు 'రేయ్ శివాజీ' అంటూ పిలుస్తుంటే నాకు కలిగే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు లేవు. మీరు కూడా అవకాశం ఉన్నపుడల్లా మీ పాత స్నేహితులను కలుసుకోండి. ఆ కలయిక మీకు కొత్త ఉత్తేజాన్నిస్తుంది' అని పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 03:34 PM