GV Prakash: జి.వి. ప్రకాశ్‌కు ఆర్ఎక్స్100 బైక్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత..
ABN , Publish Date - Sep 11 , 2026 | 02:20 PM
సినిమా హిట్ అయితే హీరోలకు ఖరీదైన కార్లు, బైకులు బహుమతిగా ఇవ్వడం సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం.
సినిమా హిట్ అయితే హీరోలకు ఖరీదైన కార్లు, బైకులు బహుమతిగా ఇవ్వడం సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పుడు నిర్మాతలు తమ హీరోలు, దర్శకులను ప్రత్యేకంగా సర్‌ప్రైజ్ చేయడం చూస్తుంటాం. అయితే తమిళ నటుడు, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ విషయంలో ఓ నిర్మాత కాస్త భిన్నంగా ఆలోచించారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఆయనకు సరికొత్త ఆర్ఎక్స్100 బైక్‌ను కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.
జి.వి. ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇమ్మోర్టల్’. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠను పంచే కథ, భయపెట్టే సన్నివేశాలతో పాటు జి.వి. ప్రకాశ్ నటనకు కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కినట్లు చిత్రబృందం పేర్కొంది. సినిమాకు వచ్చిన ఆదరణతో చిత్ర నిర్మాత అరుణ్‌కుమార్ ధనశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హీరో జి.వి. ప్రకాశ్‌కు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన సాధారణంగా హీరోలకు ఇచ్చే కార్లకు భిన్నంగా ఆర్ఎక్స్100 బైక్‌ను బహుమతిగా అందించారు. దీంతో ఈ గిఫ్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. జి.వి. ప్రకాశ్‌కు బైక్‌ను అందజేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విజయానికి గుర్తుగా తనకు బైక్‌ను బహుమతిగా అందించడం పట్ల జి.వి. ప్రకాశ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.