Anant Nag: సహజ నటనకు.. విశిష్ఠ పురస్కారం

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:16 AM

దశాబ్దాల తన సహజ నటనతో, విభిన్న పాత్రలతో ప్రత్యేకత చాటుకున్న నటుడు అనంత్‌నాగ్. తరాలకు స్ఫూర్తినిస్తూ ఆయన సుదీర్ఘ నట ప్రయాణం సాగుతోంది.

Anant Nag

దశాబ్దాల తన సహజ నటనతో, విభిన్న పాత్రలతో ప్రత్యేకత చాటుకున్న నటుడు అనంత్‌నాగ్ (Anant Nag). తరాలకు స్ఫూర్తినిస్తూ ఆయన సుదీర్ఘ నట ప్రయాణం సాగుతోంది. 1970వ దశకంలో నాటకరంగం ద్వారా కళా ప్రయాణాన్ని ప్రారంభించిన అనంత్‌నాగ్‌ ఆ తర్వాత ఆర్ట్‌, కమర్షియల్‌ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం లిఖించారు. వైవిధ్యమైన పాత్రలతో కన్నడ చిత్ర పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు పొంది, భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగారు. ఆర్ట్‌ చిత్రాల దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ రూపొందించిన ‘అంకుర్‌’ చిత్రంలో నటించిన అనంత్‌నాగ్‌ ఆ తర్వాత ఆయన రూపొందించిన ‘నిశాంత్‌’, ‘భూమిక’, ‘కొండుర’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.

ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 300కి పైగా చిత్రాల్లో అనంత్‌నాగ్‌ విభిన్న పాత్రలు పోషించారు. అందులో 250 కన్నడ సినిమాలే కావడం విశేషం. ఒకే భాషకు పరిమితం కాకుండా తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, మలయాళ, ఆంగ్ల భాషా చిత్రాల్లో నటించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు 1995లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ లభించింది. మళ్లీ 31 ఏళ్ల తర్వాత ఆ విశిష్ఠ పురస్కారం పొందిన రెండో కన్నడ నటుడు అనంత్‌నాగ్‌.

కర్నాటకలో పుట్టి, మహారాష్ట్రలో ఎదిగి..

1948 సెప్టెంబర్‌ 4న సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అనంత్‌నాగ్‌ చిన్నతనమంతా కర్నాటకలో స్వామి రామదాస్‌ నెలకొల్పిన ఆనంద్‌ ఆశ్రమంలోనే గడిచింది. చదువు విషయంలో శ్రద్ధతో ఎప్పుడూ టాప్‌ ఫైవ్‌ ర్యాంకర్స్‌లో ఒకరిగా ఉండేవారు అనంత్‌నాగ్‌. తొమ్మిదో తరగతి వరకూ పుట్టిన ఊళ్లోనే చదువుకున్న అనంత్‌నాగ్‌ను పై చదువుల కోసం ముంబై పంపించారు ఆయన తండ్రి. తన పదకొండో ఏటా ముంబైలోకి అడుగు పెట్టిన అనంత్‌నాగ్‌కు ఆ మహానగరం ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది.

కన్నడ, కొంకణీ, మరాఠీ నాటకాలు ఎక్కువగా చూసేవారు. నాటకాల మీద ఆ ఆసక్తే ఆయన్ని నటుడిగా మార్చింది. ఎన్నో నాటకాల్లో వైవిధ్య పాత్రలు పోషించిన అనుభవం ఆయనకు సినిమా నటుడిగా ఎంతో ఉపయోగపడింది. ఆనాటి రంగ స్థల ప్రముఖులు గౌరంగ్‌, సత్యదేవ్‌ దూబే, అమోల్‌ పాలేకర్‌ వంటి వారితో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్‌కు మంచి పునాది వేశాయి. దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసి తనకు ‘అంకుర్‌’ సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది దూబేనని అనంత్‌నాగ్‌ చెబుతుంటారు.

ముంబై లో 14 ఏళ్లు

బాంద్రాలోని కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన అనంత్‌నాగ్‌ ఆ తర్వాత ముంబై యూనియన్‌ బ్యాంక్‌లో మూడేళ్లు ఉద్యోగం చేశారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ కోటాలో ఆయనకు బ్యాంక్‌ ఉద్యోగం లభించడం విశేషం. ఆ తర్వాత బ్యాంక్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరు వచ్చేసి నటన మీద పూర్తి దృష్టి పెట్టారు. 1973 లో వచ్చిన ‘సంకల్ప’ ఆయన తొలి సినిమా.


చంద్రబాబు నాయుడు పాత్రలో..

తెలుగులో తొలిసారిగా ‘ప్రేమలేఖలు’ చిత్రంలో నటించారు అనంత్‌నాగ్‌. అన్నపూర్ణ పిక్చర్స్‌ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ఈ సినిమాలో జయసుధ బాయ్‌ఫ్రెండ్‌గా నెగెటివ్‌ పాత్రను ఆయన పోషించారు. తెలుగులో ఆయన నటించిన చిత్రాల్లో ‘శంఖారావం’ (2004) గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆ సినిమాలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పోలిన పాత్రను అనంత్‌ నాగ్‌, ప్రతిపక్ష నాయకుడు రాజశేఖరరెడ్డిని పోలిన పాత్రను శరత్‌బాబు పోషించారు.

సినిమాలో వారి పాత్రల పేర్లు వేరుగా ఉన్నా వారికి ఇచ్చిన గెటప్స్‌, మేనరిజమ్స్‌ ఆ రాజకీయ నాయకులను గుర్తు చేస్తుంటాయి. ఆ తర్వాత ‘బాలు’, ఐదేండ్ల క్రితం వ‌చ్చిన నిత‌న్ ‘భీష్మ’ చిత్రాల్లో కూడా అనంత్‌నాగ్‌ నటించారు. అలాగే ‘కేజీఎఫ్‌’ చిత్రం మొదటి భాగం స్టోరీని అనంత్‌నాగ్‌ రన్‌ చేసిన విధానం చూసి ఆయనకు అభిమానులుగా మారిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

భార్య కూడా నటీమణే

అనంత్‌నాగ్‌ సతీమణి గాయత్రి కూడా నటీమణే. చిరంజీవి నటించిన ‘మొగుడు కావాలి’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. కన్నడంలో కొన్ని సినిమాల్లో నటించిన గాయత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనంత్‌నాగ్‌. ఈ దంపతులకు ఒక్కతే కుమార్తె అదితి.

ఇంటింటా గుర్తింపు

దూరదర్శన్‌ స్వర్ణయుగంలో ఆర్కే నారాయణ్‌ రచనల ఆధారంగా రూపొందిన టీవీ సీరియల్‌ ‘మాల్గుడి డేస్‌’ (1986)లో అనంత్‌నాగ్‌ విభిన్న పాత్రలు పోషించి దేశవ్యాప్తంగా ఇంటింటా అందరి అభిమానాన్ని పొందారు. ఈ టీవీ సీరియల్‌కు అనంత్‌నాగ్‌ సోదరుడు శంకర్‌ నాగ్‌ దర్శకుడు కావడం గమనార్హం.

Updated Date - Sep 17 , 2026 | 11:16 AM