ఎట్టకేలకు కృతిశెట్టి మూవీకి మోక్షం!
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:41 PM
ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించిన 'ఎల్.ఐ.కె.' మూవీ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు.
తమిళ దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ విజయపథంలో సాగిపోతున్నా... అతని సినిమా 'ఎల్.ఐ.కె.'కు మాత్రం గ్రహణం పట్టింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 3న వస్తుందని మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు మూడవ తేదీ నుండి ఈ సినిమాను ఏప్రిల్ 10కి వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. ఎస్.జె. సూర్య, సీమాన్, యోగిబాబు, గౌరికిషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఆర్థికపరమైన లావాదేవీల కారణంగానే సినిమా పలు మార్లు వాయిదా పడినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'ఎల్.ఐ.కె' తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేసి, శ్రీ పద్మినీ సినిమాస్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏప్రిల్ 10న విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా మార్చి 30న మూడో తమిళ సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం సమకూర్చాడు. ఆ మధ్య వచ్చిన కృతిశెట్టి తమిళ అనువాద చిత్రం 'అన్నగారు వస్తారు' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు ఆమె ఆశలన్నీ 'ఎల్.ఐ.కె' సినిమా మీదే పెట్టుకుంది.