Marigold: మూడు దశాబ్దాల తర్వాత కలిసిన హిట్ జోడీ.
ABN , Publish Date - Aug 15 , 2026 | 07:44 AM
సీనియర్ నటుడు ప్రభు, నటి సుకన్య.. ఒకప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించిన హిట్ జోడీ.
సీనియర్ నటుడు ప్రభు(Prabhu), నటి సుకన్య (Sukanya)ఒకప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించిన హిట్ జోడీ. ‘సెంతమిళ్‌పాట్టు’, ‘చిన్న మాప్పిళై’, ‘మిస్టర్ మద్రాస్’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంటకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి తెరపై కనిపించలేదు. 31 ఏళ్ల తర్వాత ఈ సీనియర్ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభు–సుకన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘మేరీగోల్డ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, మనుషుల మధ్య ఉండే బంధాలను ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తిరునెల్వేలి, తూత్తుక్కుడి ప్రాంతాల నేపథ్యంతో సాగే ఈ కథలో పల్లెటూరి వాతావరణం కూడా కీలకంగా ఉండనుంది.
ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత ఆర్. రవీంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియన్ రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. కథలోని భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూనే, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో సినిమాను రూపొందించనున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఇక ఈ చిత్రంలో రక్షణ్, నమ్రత, సింగంపులి, వడివుక్కరసి, ఇమాన్ అన్నాచ్చి, వివేక్ ప్రసన్న, స్టాలిన్, వడివేల్ మురుగన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా గ్యాప్ తర్వాత ప్రభు–సుకన్య కలిసి నటిస్తుండటంతో ‘మేరీగోల్డ్’పై ఆసక్తి పెరుగుతోంది. అసలు ఈ ఇద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? వారి మధ్య ఎలాంటి బంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారు? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.