ఎన్నికల బరిలో ఖుష్బూ భ‌ర్త‌ సుందర్ సి

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:28 PM

త‌మిళ‌నాడు రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ప్రముఖ నటి ఖుష్బూ భర్త, ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి పోటీ చేస్తున్నారు.

Khushboo

త‌మిళ‌నాడు రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ప్రముఖ నటి ఖుష్బూ (Khushboo) భర్త, ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ సి (Sundar C) పోటీ చేస్తున్నారు. ఎన్.డి.ఎ. కూటమి మిత్రపక్షమైన పుదియ నీది కట్చి (న్యూ జస్టిస్ పార్టీ) (Puthiya Needhi Katchi PNK)) తరపున ఆయన బరిలో నిలిచారు. మధురై (సెంట్రల్) నియోజకవర్గాన్ని ఎన్.డి.ఎ. పి.ఎన్.కె. పార్టీకి కేటాయించింది. దీంతో ఇక్కడ అభ్యర్థిగా సుందర్ సి ని పుదియ నీతికట్చి అధ్యక్షుడు ఏసీ షణ్ముగం (AC Shanmugam) ప్రకటించారు.

ఇదిలాఉంటే.. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఖుష్బూ ప్ర‌చారంలో చురుగ్గా ఉండ‌గా భర్త సుందర్ మాత్రం బీజేపీ తరపున కాకుండా, న్యూ జస్టిస్ పార్టీ తరపున పోటీ చేస్తుండటం ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్ అయింది. అయితే, సుందర్ పోటీ చేసే పార్టీ వేరైనప్పటికీ ఆయన మాత్రం రెండాకుల గుర్తుపైనే పోటీ చేయనున్నారు.

ఈ స్థానం నుంచి అధికార డీఎంకే తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కొనసాగుతుండ‌గా ఆయ‌న‌కు పోటీగా సుంద‌ర్ బ‌రిలో నిలిచారు.. ఇదిలావుంటే, పుదియ నీతి కట్చికి ఎన్.డి.ఎ. తరపున మరో సీటును కేటాయించనున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరుతో పాటు స్థానం పేరును ఈ నెల 30వ తేదీన వెల్లడిస్తామని ఏసీ షణ్ముగం పేర్కొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 08:25 AM