Niharika: ‘బిచ్చగాడు’ కంటే ‘ రెట్టింపు విజయం సాధించాలి
ABN , Publish Date - Jun 15 , 2026 | 06:31 PM
'విజయ్ ఆంటోని చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఆయనలో ఇంత ప్రతిభ ఉన్నా.. అన్నింటికంటే మంచి వ్యక్తి ఆయన. కలిసి మాట్లాడాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది.
'విజయ్ ఆంటోని (Vijay antony) చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఆయనలో ఇంత ప్రతిభ ఉన్నా.. అన్నింటికంటే మంచి వ్యక్తి ఆయన. కలిసి మాట్లాడాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది. సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో.. అంతే వినోదాత్మకంగా ఉంటుంది. ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది. అమ్మను కలిగిన ప్రతీ ఒక్కరూ ‘వంద దేవుళ్ళు’ (Vanda devullu) సినిమాని చూడాలి' అని నిహారిక కొణిదెల అన్నారు.
విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ‘బిచ్చగాడు’ తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన సినిమా ఇది. ఈ నెల 19న రిలీజ్ కాబోతోంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిహారిక కొణిదెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ 'శశి 20 ఏళ్ల క్రితం నన్ను మ్యూజిక్ దర్శకుడిగా, పదేళ్ల క్రితం ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అంటూ మేం రాబోతోన్నాం. శశి కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘బిచ్చగాడు’ నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీ గారికి థాంక్స్. ‘వంద దేవుళ్ళు’ మూవీని సుబ్బారెడ్డి గారు, మైత్రి శశి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జూన్ 19న రాబోతోన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది' అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘వంద దేవుళ్ళు’ మూవీని ఆల్రెడీ నేను చూశాను. శశి తీసిన ‘శ్రీను’ మూవీ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన ‘బిచ్చగాడు’ లాంటి గొప్ప సినిమాని తీశారు. ప్రతీ ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పని చేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్‌ను గొప్పగా చూపించారు. స్వాసిక అద్భుతంగా నటించారు. అజయ్, కావ్య అందరూ చక్కగా నటించారు. ‘వంద దేవుళ్ళు’ అనే టైటిలే నాకు చాలా బాగా నచ్చింది. టైటిల్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ ఆంటోని గారు చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. ఆయన దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎన్ని ఉన్నా.. అన్నింటికంటే మంచి వ్యక్తి. ఆయన్ను కలిసి మాట్లాడాక మరింత గౌరవం పెరిగింది. ఈ చిత్రంలో ఫ్యాన్ నుంచి టీ కప్పు వరకు అన్నింటికీ ఓ ఇంపార్టెన్స్, ఓ కారెక్టర్ ఉంటుంది. ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో.. అంతే వినోదాత్మకంగా ఉంటుంది. విజయ్ ఆంటోని గారి పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది. ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది. కమర్షియల్ అంశాలతోనే గొప్పగా చిత్రాన్ని మలిచారు. అమ్మను కలిగిన ప్రతీ ఒక్కరూ ‘వంద దేవుళ్ళు’ సినిమాని చూడాలి. ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు శశి మాట్లాడుతూ 'బిచ్చగాడు’ మూవీతో పదేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను. అప్పుడు మా గురించి ప్రేక్షకులకు ఏమీ తెలియకపోయినా పెద్ద హిట్ చేశారు. ఆ మూమెంట్ నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగు ప్రేక్షకుల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు మళ్లీ విజయ్ ఆంటోనితోనే ‘వంద దేవుళ్ళు’ అని తల్లి కొడుకుల కథతో రాబోతోన్నాను. ఇది ‘బిచ్చగాడు’కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మని దేవతలా చూస్తే అది ‘బిచ్చగాడు’.. అమ్మని సాధారణ మనిషిలా చూస్తే ‘వంద దేవుళ్లు’. ‘బిచ్చగాడు’ ఎంతలా నచ్చిందో.. ‘వంద దేవుళ్ళు’ కూడా అంతే స్థాయిలో నచ్చుతుంది’ అని అన్నారు.