Namitha: అప్పట్లో నాకు చాలా గర్వం.. ఎవరిని లెక్కచేసేదాన్ని కాదు

ABN , Publish Date - Aug 30 , 2026 | 09:09 PM

తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు గ్లామరస్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Namitha

తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు గ్లామరస్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత జెమిని, ఒకరాజు ఒక రాణి లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. మొదట్లో సన్నగా ఉన్న ఈ భామ.. ఆ తరువాత బొద్దుగా మారి ఇండస్ట్రీని షేక్ చేసింది. అమ్మడి అందానికి తమిళ తంబీలు ముగ్ధులై గుడి కూడా కట్టించారు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈ చిన్నది పెళ్లి చేసుకొని కవల పిల్లలకు జన్మనిచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు ప్రధాన హీరోలందరి సరసన నటించిన ఆమె, ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా ఆకట్టుకొని ప్రస్తుతం రాజకీయాలు, కుటుంబ జీవితంపై దృష్టి సారించింది.


ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నమిత తన సినీ కెరీర్ ప్రారంభంలో ఫేమ్ రావడం వల్ల తనలో వచ్చిన గర్వం, అహంకారం గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రెండేళ్లలో తనకు అహంకారం, కఠినమైన ప్రవర్తన ఎక్కువగా ఉండేదని ఆమె ఒప్పుకుంది. ఆరంభంలోనే వరుస విజయాలు, నిరంతరం మీడియా దృష్టి తనపై ఉండటంతో తల పొగరు పెరిగిందని, అయితే అది తప్పు అని ఇప్పుడు గ్రహించినట్లు చెప్పుకొచ్చింది. తన ప్రవర్తన వల్ల అప్పట్లో సెట్స్‌లోని తోటి నటులు, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బంది పడి ఉంటారని నమిత ఆవేదన వ్యక్తం చేసింది.


అయితే, ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు, సహచరులు తనకు హెచ్చరికతో కూడిన మంచి సలహా ఇచ్చారని, ఈ రకమైన ప్రవర్తన.. అహంకారం ఉంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడలేవని వారు నచ్చజెప్పడంతో, తాను వెంటనే రియలైజ్ అయి తన వైఖరిని మార్చుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తన కెరీర్‌లో కొన్ని సరైన సినిమాలు ఎంచుకోలేకపోయానని, కొన్ని చేయకూడదని భావించిన చిత్రాలు కూడా చేశానని నమిత అభిప్రాయపడింది. గతం నుంచి పాఠాలు నేర్చుకొని తప్పులను సరిదిద్దుకోవడం వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానని నమిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Aug 30 , 2026 | 09:09 PM