నిర్మాతను ముంచేసిన 'మదరాసి'

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:44 PM

దర్శకుడు మురుగదాస్‌ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. శివ కార్తికేయన్‌తో ఆయన తెరకెక్కించిన 'మదరాసి' సినిమా పరాజయం కావడంతో నిర్మాత... పది కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు.

A. R. Murugadoss

ప్రముఖ దర్శక, నిర్మాత మురుగదాస్‌ (Murugadas) కు కాలం కలిసి రావడం లేదు. అతను నిర్మించిన సినిమాలే కాదు... డైరెక్షన్ చేసిన సినిమాలు సైతం వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఆ మధ్య మురుగదాస్... శివకార్తికేయన్‌ (Shiva Karthikeyan) హీరోగా 'మదరాసి' (Madarasi) సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా గత యేడాది సెప్టెంబర్‌లో విడుదలై అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. మురుగదాస్‌ ఇమేజే కాదు... శివ కార్తికేయన్‌కు ఉన్న క్రేజ్‌నూ ఈ సినిమా నిలుపుకోలేక పోయింది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు 115 కోట్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పిన మురుగదాస్‌.. ఏకంగా బడ్జెట్ ను రూ. 170 కోట్లకు పెంచేశాడని నిర్మాత వాపోయారు. సరైన ప్లానింగ్ లేకపోవడం, ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే, సల్మాన్ ఖాన్‌తో హిందీ సినిమా 'సికందర్' చేయడంతో బడ్జెట్ పెరిగిపోయిందన్నది ప్రొడ్యూసర్ వాదన. అపరిమితంగా పెరిగిన బడ్జెట్ కారణంగా భారీగా నష్టపోయిన నిర్మాత చివరకు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ తలుపులు తట్టారు. మురుగదాస్‌ నుండి తనకు పదికోట్ల నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా నిర్మాత కోరాడు. పలుమార్లు చర్చలు జరిగిన అనంతరం చివరకు మరుగదాస్‌ త్వరలో తానే చేయబోతున్న 'రమణ 2' సినిమా తెలుగు స్టోరీ రైట్స్‌ను నిర్మాతకు అందించడానికి అంగీకరించాడట.


దాదాపు పాతికేళ్ళ క్రితం మురుగదాస్‌ తెరకెక్కించిన 'రమణ' చిత్రం తమిళంలో ఘన విజయం సాధించడమే కాదు... తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. తెలుగులో దీనిని మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్‌' పేరుతో రీమేక్‌ చేశారు. ఇక్కడా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడా సినిమా తెలుగు స్టోరీ రైట్స్‌ను 'మదరాసి' నిర్మాతకు ఇస్తానని చెబుతున్నాడట. ఇవాళ మారిన పరిస్థితుల్లో 'రమణ 2' సినిమాను మురుగదాస్‌ ఎవరితో తీస్తాడు? పాన్ ఇండియా మూవీగా ఒకే భాషలో రూపొందించి, వివిధ భాషల్లో డబ్ చేసిన రిలీజ్ చేస్తాడా? అనేది చూడాలి.

Updated Date - Mar 30 , 2026 | 12:44 PM