ధనుష్‌కు.. నిర్మాణ సంస్థ లీగల్ నోటీసు! రూ.20 కోట్ల.. నష్టపరిహారం డిమాండ్
ABN , Publish Date - Feb 15 , 2026 | 08:02 AM
ఒప్పందం మేరకు కాల్షిట్లు కేటాయించకుండా ఇతర సినిమాలకు పనిచేస్తున్న హీరో ధనుష్ రూ.20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తేనాండాళ్ ఫిలిమ్స్ లీగల్ నోటీసు పంపించింది.
తమతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కాల్షిట్లు కేటాయించకుండా ఇతర సినిమాలకు పనిచేస్తున్న హీరో ధనుష్ (Dhanush) రూ.20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తేనాండాళ్ ఫిలిమ్స్ (Thenandal Films) లీగల్ నోటీసు పంపించింది. ఈ అంశం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
2016లో ధనుష్ స్వీయ దర్శకత్వంలో 'నాన్ రుద్రన్ (Naan Rudran) చిత్రాన్ని నిర్మించేందుకు తేనాండాళ్ ఫిలిమ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ధనుష్, నాగార్జున (Nagarjuna), ఎసీజే సూర్య (SJ Suryah) తదితరులు నటించేందుకు అడ్వాన్స్, ఇతర ఖర్చుల కింద రూ.20 కోట్ల మేరకు ఖర్చు చేశారు.
అయితే, ధనుష్ కాల్షీట్‌తో పాటు పూర్తి స్క్రిప్టు ఇవ్వకపోగా, ఇతర సినిమాలకు పనిచేస్తున్నారు. 2025 ఆఖరులో కాల్షిట్ ఇస్తామని హామీ ఇచ్చారని, దీనిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, లేకపోతే రూ.20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాణ సంస్థ తరపు న్యాయవాది ఈ నోటీసులను పంపించారు. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు.