MS Raju: 'అగధ'తో మంజుల మనవరాలి టాలీవుడ్ ఎంట్రీ!
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:44 PM
అలనాటి నటి, స్వర్గీయ మంజుల మనవరాలు సైతం సినిమాల్లోకి వచ్చేసింది. మంజుల కుమార్తె వనితను 'దేవి' మూవీతో పరిచయం చేసిన ఎమ్మెస్ రాజు ఇప్పుడు ఆమె కుమార్తె జోవికా విజయ్ కుమార్‌ను 'అగధ' మూవీతో పరిచయం చేస్తున్నారు.
ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు ప్రస్తుతం 'అగధ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా అలనాటి నటి, స్వర్గీయ మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్ నటిగా పరిచయం అవుతోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజుల తెలుగులో 'మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రయ్య, మాయదారి మల్లిగాడు, మంచి మనుషులు' తదితర విజయవంతమైన చిత్రాలలో నటించింది. అలానే ఆమె భర్త విజయ్ కుమార్ సైతం పలు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. విశేషం ఏమంటే... మంజుల కుమార్తె వనితను 'దేవి' సినిమాతో తెలుగు తెరకు ఎమ్మెస్ రాజు పరిచయం చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1999లో ఆ సినిమాను ఆయన నిర్మించారు. ఇప్పుడు 'అగధ'తో మంజుల మనవరాలు, వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్‌ను ఆయన పరిచయం చేస్తున్నారు.
'అగధ'లో జోవికా విజయ్ కుమార్ పోషిస్తున్న పాత్ర పేరు ‘హరిణి ‘. ఆమె క్యారెక్టర్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. జోరున కురుస్తోన్న వర్షంలో జోవికా కత్తిపట్టుకుని నిలబడి ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే... కథలోని గాఢత కనిపిస్తోంది. ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్ వర్క్, దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్‌తో, ‘అగధ’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.