Bethlehem Kudumba Unit: మమితా బైజు మాయ.. 6 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:04 PM
నివిన్ పాలీ, మమితా బైజు నటించిన ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ కేవలం 6 రోజుల్లోనే ₹100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మరో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇటీవల ఓనమ్ పండుగను పురస్కరించుకుని థియేటర్లకు వచ్చిన ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. హృద్యమైన కథ, వినోదం, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో థియేటర్ల వద్ద మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. స్టార్ హీరో నివిన్ పాలీ (Nivin Pauly), మమితా బైజు (Mamitha Baiju) జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విడుదలైన తొలి వారం నుంచే ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని మలయాళ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు పెడుతోంది.
రేండేండ్ల క్రితం ప్రేమలు సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ గిరీష్ ఏడీ (Girish AD) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. కేరళ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘బెత్లెహెమ్ ఫ్యామిలీ యూనిట్’ కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అయితే.. ఈ సినిమా ఇతర భాషల్లోకి డబ్ కాకుండానే, కేవలం మలయాళ వెర్షన్‌తోనే ఈ ఘనత సాధించడం విశేషం. నివిన్ పాలీ సహజమైన నటన, మమితా బైజు ఆకట్టుకునే పాత్ర, గిరీష్ ఏడీ ప్రత్యేక శైలిలో తెరకెక్కించిన కథనం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. భావన స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్రేక్ లేకుండా దూసుకుపోతూ 2026 ఓనమ్ సీజన్‌లో అతిపెద్ద విజయంగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలాఉంటే.. ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో తెలుగులోనూ థియేటర్లకు వచ్చేస్తోంది.