AMMA: అమ్మలో రాజీనామాల కలకలం
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:42 PM
ప్రముఖ నటీమణులు రేవతి, పద్మప్రియ 'అమ్మ'కు రాజీనామా చేశారు. అధికారం మారిన సమస్యలను పరిష్కరించడంతో 'అమ్మ' విఫలమైందని, ఇందులో తాము కొనసాగలేమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
మలయాళ సినీ తారల సంస్థ 'అమ్మ'లో రాజీనామాల పరంపరం కొనసాగుతోంది. ఆ మధ్య 'హేమ కమిటీ' చేసిన సిఫార్సులు, ఆ కమిటీ చేసిన ఆరోపణల నేపథ్యంలో అప్పటి 'అమ్మ' అధ్యక్షుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. దాంతో ఆయనతో పాటు కార్యవర్గ సభ్యులంతా రిజైన్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ మలయాళీ నటి శ్వేతా మీనన్ 'అమ్మ' అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 'అమ్మ'కు అధ్యక్షులైన తొలి మహిళగా శ్వేతామీనన్ రికార్డ్ సృష్టించారు. కానీ తాజాగా జరిగిన కార్యవర్గ సమావేశంలో వీరిపై పలు ఆరోపణలు రావడంతో శ్వేత మీనన్ తో పాటు మొత్తం కార్యవర్గం రాజీనామా చేసింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో 'అమ్మ'కు ప్రముఖ నటీమణులు రేవతి, పద్మప్రియ సైతం రాజీనామా చేయడంతో ఈ వివాదం తారాస్థాయిని చేరుకున్నట్టైంది.
జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటు కావడం వెనుక రేవతి, పద్మప్రియ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సంస్థ కూడా ఉంది. ఎంతో కాలంగా వీరు పని ప్రదేశంలో మహిళలకు భద్రత, గౌరవం, జవాబుదారీతనం, సమాన వేతనాల కోసం కృషి చేస్తూ వచ్చారు. అయితే... ఈ పోరాటంలో భాగంగా అధికారం చేతులు మారినా ప్రాధాన్యతలు మారలేదని, 'అమ్మ'లో ఇంకా పితృస్వామ్య ధోరణులు, అధికార రాజకీయాల ప్రభావం కొనసాగుతూనే ఉందని వారు భావించారు. దాంతో ఇద్దరూ సంయుక్త ప్రకటన ఇచ్చి ప్రాధామిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని, తొందరపాటు చర్య కూడా కాదని వారు చెప్పారు. ఈ సినిమా రంగానికి ఎన్నో దశాబ్దాలుగా తాము సేవ చేశామని, భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. మలయాళ సినిమా ఎప్పటికీ తమదేని, దానిని ప్రేమించడం, దాని కోసం పనిచేయడం మానమని చెబుతూ, అందుకోసం ఏ సంస్థ సభ్యత్వం అవసరం లేదని తాము భావిస్తున్నట్టు తెలిపారు.
దీనిపై మరింత వివరణ ఇస్తూ, 'ఈ సమయంలో సంస్థను వీడటం ఓటమి కాదు. అది మా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే నిర్ణయం. దాదాపు పదేళ్లుగా మా డిమాండ్ ఒక్కటే. మహిళలకు సురక్షితమైన పని వాతావరణం, గౌరవం, జవాబుదారీతనం, సమాన హక్కులు కల్పించాలి. ప్రతి సభ్యుడికి లభించాల్సిన కనీస హక్కులే ఇవి. ఈ విలువలను నిలబెట్టుకోవడం కోసం అందరం ఏకమవుతామని నిజాయితీగా విశ్వసించాం. కానీ డిమాండ్లను వినిపించినందుకు మౌనాన్ని, ఒంటరితనాన్ని మేం ఎదుర్కొన్నాం. సహచరులు, స్నేహితులు, ఒకప్పుడు సొంతిల్లు అనిపించిన వేదికల నుంచి దూరమయ్యాం. అయినా మా ఆశ చావలేదు. ఎందుకంటే నిరాశల మధ్య కూడా ఆశ బతికే ఉంటుంది. మాకు తెలిసి జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత జరిగిన పరిణామాలు, రాజీనామాలు నైతిక బాధ్యత వహించి తీసుకున్న నిర్ణయాలు కాదు. జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రమే. అధికారం తనను తాను రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంటుంది. ముఖాలు మారవచ్చు, పద్ధతులు మారవచ్చు. కానీ అసమానతలను కొనసాగించే వ్యవస్థ మాత్రం అలాగే ఉంటుంది' అని వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలు ముందు తరాలు చేసిన పోరాటాలను మళ్లీ చేయాల్సిన అవసరం లేని స్థాయికి చేరుకుంటారనే అచంచల విశ్వాసం తమకు ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి రేవతి, పద్మప్రియ రాజీనామాలపై మలయాళ నటీనటులు ఎలా స్పందిస్తారో చూడాలి.