మైనర్ బాలికలకు ప్రైవేట్ పార్ట్స్ చూపించి వేధింపులు.. నటుడికి ఏడాది జైలు
ABN , Publish Date - Nov 23 , 2026 | 09:41 PM
మలయాళ సినీ నటుడు శ్రీజిత్ రవి (Sreejith Ravi)కి పోక్సో కేసులో త్రిశూర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు-II ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
మలయాళ సినీ నటుడు శ్రీజిత్ రవి (Sreejith Ravi)కి పోక్సో కేసులో త్రిశూర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు-II ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2022 జూలై 4న కేరళలోని త్రిశూర్, అయ్యాంతోల్లోని ఎస్ఎన్ పార్క్ సమీపంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న 9 ఏళ్లు, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికల ఎదుట కారులో వచ్చిన శ్రీజిత్ రవి తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనపై బాలికలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్, కారు వివరాల సహాయంతో పోలీసులు అప్పట్లోనే ఆయనను అరెస్ట్ చేశారు.
భార్య, బిడ్డ ఉన్న ఒక ప్రముఖ నటుడు ఇలా పసిపిల్లల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించడం పట్ల అప్పట్లోనే సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విచారణ సమయంలో తనకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్సలో లోపం వల్లే అలా జరిగిందని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం 21 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం, ఐపీసీ సెక్షన్ 509, పోక్సో చట్టంలోని సెక్షన్ 11(1) కింద శ్రీజిత్ రవిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేసింది. జరిమానాగా విధించిన రూ. 50,000 మొత్తాన్ని బాధిత బాలికలకు అందజేయాలని కోర్టు ఆదేశించింది.
2022లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2026 నవంబర్లో తీర్పు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మైనర్ బాలికలకు న్యాయం జరగడానికి ఏళ్ల తరబడి సమయం పట్టడంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ హోదా, ఇమేజ్ లేదా పలుకుబడి ఏదీ చట్టం ముందు రక్షణ కవచం కాకూడదని, ఆలస్యమైన న్యాయం తిరస్కరించబడిన న్యాయంతో సమానమని అభిప్రాయపడుతున్నారు. కాగా, పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ట్రయల్ కోర్టు ఈ శిక్షను ఒక నెల పాటు సస్పెండ్ చేస్తూ శ్రీజిత్ రవికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.