తెలుగులోనూ వస్తున్న మలయాళ చిత్రం 'చథా పచ్చ'

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:08 PM

మలయాళ చిత్రం 'చథా పచ్చ' ఫిబ్రవరి 13న తెలుగులో విడుదల కాబోతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాను సురేశ్‌ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు వారి ముందుకు తీసుకొస్తోంది.

Chatha Pacha Movie

రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ చిత్రం 'ఛథా పచ్చ'. ఈ సినిమాను షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మించారు అద్వైత్ నాయర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి 'ది రింగ్ ఆఫ్ రౌడీస్’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విడుదలై విజయవంతంగా సాగుతున్న ఈ మూవీని తెలుగులో ఫిబ్రవరి 13న సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. ఈ క్రమంలో చిత్రబృందం శనివారం మీడియా ముందుకు వచ్చి సినిమా విశేషాల్ని పంచుకుంది.

ఈ కార్యక్రమంలో నటుడు రోషన్ మాథ్యూ మాట్లాడుతూ, ‘మా ‘చథా పచ్చ’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ కు ధన్యవాదాలు. మేం ఎంతో కష్టపడి ఈ సినిమాని తీశాం. మలయాళంలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దర్శకుడు అద్వైత్‌కి ఇది మొదటి చిత్రం. కథను చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అయితే ఇందులో ఓ స్పెషల్ కేమియో కారెక్టర్ ఉంది. ఆ పాత్రకి మమ్ముట్టి గారిని అప్రోచ్ అవ్వడం, మా కోసం ఆయన అంగీకరించడం గొప్ప విషయం. ఆయన పాత్ర ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది. మేం పాత్రల కోసం, సినిమా కోసం నాలుగు నెలల పాటు రెజ్లింగ్ నేర్చుకున్నాం. తెలుగు ప్రేక్షకులకు కూడా మా మూవీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ మూవీని చూడండి' అని అన్నారు.


విశాఖ్ నాయర్ మాట్లాడుతూ, ‘మేం మొదటి సారి ఇలా హైదరాబాద్‌కు వచ్చి తెలుగులో మా సినిమాని ప్రమోట్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తుంటారు. మా సినిమా ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్‌కి థాంక్స్. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే సరైన ఫీలింగ్ కలుగుతుంది' అని చెప్పారు.

ఇషాన్ మాట్లాడుతూ, 'టాలీవుడ్‌కి రావడమనేది మా అందరికీ ఓ డ్రీమ్‌లా ఉంది. ‘చథా పచ్చ’ కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. థియేటర్లో చూస్తే కచ్చితంగా మీకు ఇది వర్త్ మూవీ అనిపిస్తుంది. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తుంది’ అని అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ప్రవీణ్ మాట్లాడుతూ, ‘స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇలానే మంచి కంటెంట్ సినిమాల్ని అందించేందుకు ప్రయత్నిస్తుంటాం' అని తెలిపారు. విశేషం ఏమంటే ఈ సినిమా జనవరి ద్వితీయార్ధంలో మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పుడు విడుదల కాని ఈ సినిమాను ఇప్పుడు సురేశ్‌ ప్రొడక్షన్స్ సంస్థ జనం ముందుకు తీసుకొస్తోంది.

Updated Date - Feb 07 , 2026 | 07:10 PM