డబ్బులు చెల్లిస్తారా? లేక జైలు శిక్ష అనుభవిస్తారా?.. రజనీ నిర్మాతకు మద్రాస్ హైకోర్టు అల్టిమేటం
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:16 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కొచ్చడియాన్’ మూవీ నిర్మాతకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది.
చెక్ బౌన్స్ కేసులో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘కొచ్చడియాన్’ (Kochadaiiyaan) మూవీ నిర్మాతకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో నాలుగు వారాల్లో రూ.2.5 కోట్లు చెల్లించాలని, లేనిపక్షంలో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. రజనీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య (Soundarya Rajinikanth) దర్శకత్వంలో 2014లో యానిమేషన్ మూవీ ‘కొచ్చడియాన్’ విడుదలైంది. ఇందులో దీపిక పదుకొణె (Deepika Padukone) హీరోయిన్.
ఈ సినిమా నిర్మాణం కోసం బెంగుళూరుకు చెందిన యాడ్‌బ్యూరో అడ్వర్‌టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన మురళీమనోహర్ (Murali Manohar) కొంత రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లింపులో భాగంగా 2014లో యాడ్ బ్యూరో సంస్థ ఎండీ అబిర్ చంద్ సహర్‌కు రూ.5 కోట్లకు మురళీమనోహర్ చెక్ ఇవ్వగా అది బౌన్స్ అయింది.
దీంతో యాడ్ బ్యూరో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు మురళీమనోహర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును మురళీమనోహర్ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. నాలుగు వారాల్లో యాడ్ బ్యూరో సంస్థకు రూ.2.5 కోట్లు చెల్లించాలని లేనిపక్షంలో ఆరు నెలల జైలుశిక్ష విధించాలంటూ ఆదేశించింది.