ప్రదీప్ రంగనాథన్ లవ్‌ ఇన్యూరెన్స్ కంపెనీ రివ్యూ

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:20 PM

ప్రదీప్ రంగనాథన్‌, కృతిశెట్టి జంటగా నటించిన సినిమా 'లవ్‌ ఇన్యూరెన్స్ కంపెనీ'. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. నయనతార నిర్మాత.

Love insurance Kompany Movie

వరుసగా వంద కోట్ల సినిమాలు మూడు చేసి హ్యాట్రిక్‌ సాధించాడు ప్రదీప్‌ రంగనాథన్‌. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించినా... హీరోగా మారి నటుడిగానూ తన సత్తాను చాటుకున్నాడు. 'లవ్‌ టుడే, డ్రాగన్‌, డ్యూడ్‌' చిత్రాలతో యూత్‌కు దగ్గరయ్యాడు. తమిళంలోనే కాదు... తెలుగులోనూ ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమాలు మంచి సక్సెస్‌ను సాధించాయి. ఇక్కడా ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. గత యేడాది విడుదల కావాల్సిన అతని క్రేజీ ప్రాజెక్ట్ 'లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ' ఎట్టకేలకు ఈ శుక్రవారం జనం ముందు కొచ్చింది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయన భార్య నయనతారతో కలిసి లలిత్‌ కుమార్ నిర్మించారు. తెలుగు వారి ముందుకు ఈ సినిమాను పద్మినీ ఫిలిమ్స్ సంస్థ తీసుకొచ్చింది. మరి ప్రదీప్ రంగనాథన్‌ సెకండ్‌ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టాడా? కృతిశెట్టి ఖాతాలో సక్సెస్‌ పడిందా? అనేది తెలుసుకుందాం.


ఇది చెన్నయ్‌లో జరిగే కథ. 2040 నాటికి ప్రపంచం టెక్నాలజీ మీద ఎంతగా ఆధారపడుతుందో చూపించే సినిమా. యువతను, వారి జీవితాన్ని కంట్రోల్ చేయడానికి సూర్య (ఎస్‌.జె. సూర్య) 'లవ్‌ ఇన్యూరెన్స్ కంపెనీ' అనే యాప్‌ ను తయారు చేస్తాడు. దాని ద్వారా ఎవరు, ఎవరితో, ఎప్పుడు ప్రేమలో పడొచ్చు? ఎప్పుడు బ్రేకప్ చెప్పొచ్చు అనేది తెలిసి పోతుంది. ఆర్గానిక్‌ రిలేషన్స్‌ కంటే కూడా ఈ యాప్ ఇచ్చే సజెషన్స్‌కే యువత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఫోన్ అడిక్షన్‌ నుండి బయట పడేయడం కోసం నిర్వహించే ఆర్గానిక్‌ విలేజ్‌ అనే రిహబిలేషన్‌ సెంటర్ నడిపే సీమాన్‌ కొడుకైన వాసు (ప్రదీప్‌ రంగనాథన్) ఆ యాప్‌కు వాయిస్‌ ఇస్తుంటాడు. ఫోన్ వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని ధీమా (కృతిశెట్టి)తో తొలి చూపు ప్రేమలో పడిపోతాడు వాసు. అయితే వీరి ప్రేమకు యాప్‌ కారణంగా గండి పడుతుంది. యాప్‌ ఇచ్చిన సజెషన్‌తో వాసుకు ధీమా దూరమైపోతుంది. మనుషుల మధ్య ప్రేమానురాగాలను కూడా యాప్‌ జడ్జ్ చేసే పరిస్థితుల్లో ఈ జంట తిరిగి కలిశారా లేదా? అనేదే మిగతా సినిమా.


మరో పదిహేనేళ్ళ తర్వాత యూత్‌ టెక్నాలజీకి ఎంతగా బానిసలు అవుతారో చూపించిన సినిమా ఇది. స్వతహాగా పుట్టాల్సిన ప్రేమ, ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే భావోద్వేగాలను యాప్‌ కంట్రోల్ చేయడం, అదే మార్కులు వేయడం అనేది ఊహకు అందేదే. వచ్చే కాలంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే భయపడుతున్నారు. జరగబోయే పరిణామాలను గ్రహించే దర్శకుడు విఘ్నేష్‌ శివన్ ఈ కథను రాసుకున్నాడు. అతను కథగా రాసుకున్నది బాగానే ఉన్నా... దానిని తెర మీద ప్రజెంట్‌ చేసే విషయంలో తడబడ్డాడు. పైగా ప్రదీప్‌ రంగనాథన్‌ అంటేనే నేచురల్ యాక్టర్ అని పేరు. ఏ పాత్ర చేసినా అందులో పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయిపోతాడు. కానీ ఇందులో అది కనిపించలేదు. యాంత్రికంగా చేసినట్టే అనిపించింది. గత చిత్రాలతో పోల్చితే ఆ ఛార్మ్ ఎక్కడో మిస్‌ అయ్యింది. అలానే ఈ యేడాది ఇప్పటికే కార్తీ మూవీ 'వా వాతియర్‌'తో చేదు అనుభవాన్ని పొందిన కృతిశెట్టికి ఈ సినిమా మళ్ళీ నిరాశనే కలిగించింది. ఆమె పాత్రను విఘ్నేష్‌ శివన్‌ అంత బలంగా రాయలేక పోయాడు. దాంతో కృతి నటన సైతం తేలిపోయింది. నటిగా ఆమె తన సత్తాను చాటుకునే సన్నివేశాలే ఇందులో లేవు. ఇక యోగిబాబు కామెడీ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ సినిమాలో కాస్తంత రిలీఫ్ ఇచ్చింది ఎస్.జె. సూర్యనే. తనదైన మార్క్ విలనీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. భర్త సినిమా కావడంతో నయనతార ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదు. కానీ బలహీనమైన కథ, కథనం కారణంగా 'లవ్‌ ఇన్యూరెన్స్ కంపెనీ' తేలిపోయింది. అనిరుధ్‌ సమకూర్చిన బాణీలు కూడా ఓ మోస్తరుగానే ఉన్నాయి. సినిమాకు అవేవీ పెద్దంత సహాయకారి కాలేదు. కొన్ని నెలలుగా ప్రదీప్‌ రంగనాథన్‌ అభిమానులను ఊరిస్తూ వచ్చిన 'లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ' వారి ఆశలపై నీళ్ళు చల్లింది. విఘ్నేష్‌ శివన్ మ్యాజిక్‌ వర్కౌట్‌ కాలేదు. వరుసగా వంద కోట్ల సినిమాలు మూడు చేసిన ప్రదీప్‌కు 'లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ' సక్సెస్ విషయంలో ఎలాంటి అస్యూరెన్స్ ఇచ్చే ఛాన్స్ కనిపించడంలేదు.

రేటింగ్: 2.25/5

ట్యాగ్‌లైన్: నో అస్యూరెన్స్!

Updated Date - Apr 10 , 2026 | 07:13 PM