Sarada: 'ఊర్వశి' శారదకు.. జేసీ డానియల్ పురస్కారం

ABN , Publish Date - Jan 17 , 2026 | 07:20 AM

మలయాళ చిత్రసీమకు విశేష సేవలందించిన సీనియర్ నటి ఊర్వశి శారదకు కేరళ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక జేసీ డానియల్ అవార్డు–2024 ప్రకటించారు.

Sarada

ప్రముఖ సీనియర్ నటి 'ఊర్వశి' శారద (Sarada) కేరళ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక జేసీ డానియల్ అవార్డు-2024 (J. C. Daniel Award) కు ఎంపికయ్యారు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా, కేరళ ప్రభుత్వం ఇచ్చే ఈ అత్యున్నత సినిమా పురస్కా రానికి శారద ఎంపికయ్యారని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారం కింద రూ. 5 లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు.

ఈ నెల 25న తిరువనంతపురంలోని నిశాగంధి ఆడిటోరియంలో జరగనున్న కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా శారద ఈ పురస్కారాన్ని అందుకొంటారు. ప్రముఖ దర్శకుడు శ్రీకుమారన్ తంపి నేతృత్వంలో నటి ఊర్వశి, దర్శకుడు బాలు కిరియత్ సభ్యులుగా ఉన్న జ్యూరీ కమిటీ ఈ అవార్డు గ్రహీతను ఎంపిక చేసింది. 80 ఏళ్ల వయసులో ఈ గౌరవాన్ని దక్కించుకున్న శారద, జేసీ డానియల్ అవార్డు అందుకుంటున్న 32వ సినీ ప్రముఖురాలు కావడం విశేషం.

1965లో 'ఇన్ఫ్రావుకల్' చిత్రం ద్వారా శారద మలయాళ చిత్రీసీమలో అడుగుపెట్టారు. ఎమ్ టీ వాసుదేవన్ నాయర్ రచిం చిన 'మురవ్చెన్ను, ఇరుట్టింటె ఆత్మవు' చిత్రాలతో ఆమె మలయాళ ప్రేక్షకులకు చేరువయ్యారు. 1968లో వచ్చిన మలయాళ చిత్రం 'తులాభారం'లో ఆమె కనబరచిన అద్భుత నటనకు గాను తొలిసారి ఉత్తమ జాతీయ నటి పురస్కారం అందుకున్నారు. మొత్తం 125కు పైగా మలయాళ చిత్రాల్లో ఆమె నటించారు. 2019లో జరిగిన కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆమె నటించిన చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. మలయాళ చిత్రసీమ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటి శారద కావడం విశేషం.

Updated Date - Jan 17 , 2026 | 08:06 AM