KD: The Devil: కేవీఎన్ ప్రొడక్షన్‌కు తీరని కష్టాలు...
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:58 PM
ధృవ సర్జా, రీష్మా నానయ్య జంటగా నటించిన 'కేడీ: ది డెవిల్' మూవీ ఈ నెల 30న విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను చివరకు కన్నడ వర్షన్ కే పరిమితం చేసినట్టు తెలుస్తోంది.
కొందరు కొన్ని సార్లు అంతా తమ చేతుల్లోనే ఉందని అనుకుంటూ ఉంటారు. పర్ ఫెక్ట్ ప్లానింగ్ చేస్తే... తిరుగుండదని భావిస్తారు. కానీ అవన్నీ భ్రమలే అని తేటతెల్లమయ్యాక ఏం చేయాలో పాలుపోక మాన్పడిపోతారు. ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందనే వైరాగ్యానికి లోనవుతారు. ప్రస్తుతం కె.వి.ఎన్. ప్రొడక్షన్ అధినేత వెంకట్ కె. నారాయణ పరిస్థితి అలానే ఉంది. ఆయన ఏం చేయాలనుకున్నా... అది రివర్స్ అవుతోంది. సంక్రాంతికి రావాల్సిన విజయ్ (Vijay) 'జన నాయగన్' (Jana Nayagan) రకరకాల కారణాలతో ఇప్పటి వరకూ వెలుగు చూడలేదు. చిరంజీవి (Chirajeevi) తో మొదలు పెట్టాల్సిన సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెలాఖరుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సిన 'కేడీ: ది డెవిల్' (KD: The Devil) సైతం ఇప్పుడు అతి కష్టం మీద కన్నడలో విడుదల అవ్వబోతోంది.
'జన నాయగన్' కష్టాలు తీరకపోయినా... 'కేడీ: ది డెవిల్'తో జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించవచ్చని నిర్మాత వెంకట్ భావించారు. కానీ ఆ సినిమాకోసం చిత్రీకరించిన ఓ ఐటమ్ సాంగ్ అపార్థాలకు దారితీయడంతో దాన్ని యూట్యూబ్ నుండి తొలగించాల్సి వచ్చింది. చిత్రం ఏమంటే... రెండు రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ విషయంలోనూ అదే జరిగింది. ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే సామాజిక మాధ్యమాల నుండి తొలగించారు. సెన్సార్ చేయకుండానే ట్రైలర్‌ను యూ ట్యూబ్ పోస్ట్ చేశారు. నిజానికి థియేటర్లలో ప్రదర్శించే వాటికి సెన్సార్ చేయాలి తప్పితే యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసే వాటికి సెన్సార్‌తో పని ఉండదు. కానీ 'కేడీ: ది డెవిల్' మేకర్స్ థియేటర్స్ కోసం కట్ చేసిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో ప్లే చేశారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెంటనే తొలగించారు. మళ్ళీ సవరణలు చేసి కొత్త ట్రైలర్ అప్లోడ్ చేస్తామని మేకర్స్ ప్రేక్షకులకు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే... గతంలో 'కేడీ'ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడ వర్షన్ ఆన్ లైన్ బుకింగ్స్‌ను మాత్రమే ప్రస్తుతం ఓపెన్ చేశారు. మొత్తం మీద ఈ నెల 30న వస్తున్న 'కేడీ' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా, రీష్మా నానయ్య జంటగా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, శిల్పాశెట్టి, నోరా ఫతేహి, రమేశ్ అరవింద్, యశ్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటి రక్షిత భర్త ప్రేమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒకవేళ సినిమాకు కన్నడలో మంచి స్పందన వస్తే... వెంటనే ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తారు. లేదంటే కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో చూసుకోవాల్సిందే!