కరుప్పు వాయిదా.. విజయే కారణం
ABN , Publish Date - May 08 , 2026 | 08:02 PM
అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా తయారైంది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కరుప్పు (Karuppu) పరిస్థితి. కమ్ బ్యాక్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆయనకు మళ్లీ ఎదురుదెబ్బ తప్పేలా లేదు.
అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా తయారైంది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కరుప్పు (Karuppu) పరిస్థితి. కమ్ బ్యాక్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆయనకు మళ్లీ ఎదురుదెబ్బ తప్పేలా లేదు. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ మూవీ అనుకోని పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య సరసన త్రిష (Trisha Krishnan) నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చాలా కాలంగా కరుప్పు వాయిదాలు, వివాదాల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయం తెల్సిందే. ఇక చివరకు ఈ సినిమా మే 14న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈసారి కూడా కరుప్పు రిలీజ్ కావడం కష్టమే అని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దానికి కారణం తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం అని టాక్. వాస్తవానికి ఈ మూవీ గత దీపావళికి విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాక పోవడంతో వాయిదా పడింది. ఆ తర్వాత పొంగల్ కి ఫిక్స్ అయినా సీజీ వర్క్ పెండింగ్ తో రిలీజ్ మరోసారి వెనక్కి వెళ్ళింది. చివరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమ్మర్ కానుకగా మే 14 తేదీని లాక్ చేశారు. అయితే ఈసారి వాయిదాకు కారణం విజయ్ అని అంటున్నారు.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు గడిచినా… విజయ్ టీవీకే సర్కారు ఏర్పాటు కాకపోవడంతో ఇప్పుడు విడుదల చేస్తే ఏం జరుగుతుందోనని మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. మరో వారం రోజుల్లో రిలీజ్ ఉండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే మే 14న చిత్రం థియేటర్లలోకి వస్తుందని, లేని పక్షంలో మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పటికే పదే పదే వాయిదాలు రూమర్లతో బజ్ తగ్గిన చిత్రానికి మరోసారి పోస్ట్ పోన్ పెద్ద ఎదురు దెబ్బ కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కరుప్పు రిలీజ్ డేట్ పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.