కార్తీతో త్రిష రొమాన్స్.. నిజమేనా
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:08 PM
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతోదూసుకుపోతున్న విషయం తెల్సిందే. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 రిలీజ్ కి సిద్ధమవుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇది కాకుండా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న కార్తీ 30 చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు కాకుండా ఈమధ్యనే కార్తీ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. తని ఒరువన్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ప్రారంభానికి ముందే హీరోయిన్ ఎంపికపై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరును చిత్రబృందం మొదటి ఆప్షన్‌గా పరిశీలిస్తోంది. అయితే, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ సర్దుబాటు కాకపోతే, త్రిషను ఫైనల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కార్తీ-త్రిషల కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ప్రేక్షకుల నుంచి వీరిద్దరి జంటకు ఉన్న ఆదరణ దృష్ట్యా, ఒకవేళ త్రిష ఈ ప్రాజెక్టులోకి వస్తే, సినిమాపై క్రేజ్ రెట్టింపు అవుతుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
కుటుంబ అనుబంధాలు, కమర్షియల్ అంశాలు మేళవించిన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మోహన్ రాజా టేకింగ్, కార్తీ నటన కలగలిస్తే, బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ ఎంపికపై మరికొద్ది రోజుల్లోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి కార్తీ-నయనతార జంటగా నటిస్తారా లేక మళ్లీ కార్తీ-త్రిషల మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి.