Tamil Cinema: కార్తీక్ సుబ్బరాజ్ సంచలన ఆరోపణ...

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:45 PM

తమిళనాట చిన్న సినిమాలకు థియేటర్లను కేటాయించపోవడాన్ని దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ తప్పుపట్టారు. అలానే పెద్ద సినిమాలకు సెన్సార్ బోర్డ్ పెడుతున్న నిబంధనలూ సమంజసంగా లేవని ఆయన విమర్శించారు. భేదాభిప్రాయాలను పక్కన పెట్టి అందరూ ఏకత్రాటిపై నిలవాలని ఆయన కోరారు.

Karthik Subbaraj

తమిళనాడులో పొంగల్ (Pogal) కానుకగా విడుదల కావాల్సిన విజయ్ (Vijay) 'జన నాయగన్' (Jana Nayagan) విడుదల వాయిదా పడింది. అలానే 10వ తేదీ విడుదల కావాల్సి ఉన్న శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) 'పరాశక్తి' (Parasakthi) బుకింగ్స్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఆ సినిమాకూ సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) తమిళ చిత్రరంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తన ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల చిన్న తమిళ చిత్రం 'సల్లియర్గల్' (Salliyargal) కు థియేటర్లు దొరకలేదు. దాంతో కడుపుమండిన నిర్మాత సురేశ్‌ కామాక్షి... దీన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేశాడు. తన సినిమాను జనవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు పెద్ద సినిమాలు సైతం ఏవీ విడుదలకు లేవని, అయినా కేవలం 27 థియేటర్లనే రాష్ట్రవ్యాప్తంగా తనకిచ్చారని, పీవీఆర్ వంటి మల్టిప్లెక్స్ థియేటర్స్ అయితే ఒక్క స్క్రీనింగ్ కూ అనుమతి ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగులో 'రాజు వెడ్స్ రాంబాయి' (Raji Weds Rambai' వంటి సినిమాకు చాలా థియేటర్లు లభించాయని, అందుకే ఆ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుందని, అలాంటి పరిస్థితి తమిళనాడులో లేదని, ఇక్కడ థియేటర్లను కొందరు కబ్జా చేసి పెద్ద సినిమాలకే ఇస్తున్నారని వాపోయాడు.


సురేశ్ కామాక్షి కష్టాలనే కార్తీక్ సుబ్బరాజ్ సైతం వివరించాడు. పెద్ద సినిమాలు అనుకున్న సమయంలో విడుదల కాకపోతే, ఏ సమస్యలైన ఆ నిర్మాతలకు ఎదురైతే సినిమా రంగం మొత్తం వారి వెనుక ఉంటుందని, వారికి దన్నుగా నిలుస్తుందని, కానీ 'సల్లియర్గల్' వంటి సినిమాలను తీసే చిన్న నిర్మాతలకు ఎవరూ బాసటగా నిలవరని అన్నాడు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోతే సినిమాను చంపేసినట్టేనని కార్తీక్ సుబ్బరాజ్ వాపోయాడు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, ఛానెల్స్ చిన్న సినిమాలను పట్టించుకోవు, తగిన ఆదాయాన్ని సమకూర్చవు. చిన్న సినిమాలకు ఎంతో కొంత ఆదాయం వచ్చేది థియేటర్లలోనే కానీ థియేటర్ల యాజమాన్యులు చిన్న సినిమాలను నిర్లక్ష్యం చేసి, వాటికి థియేటర్లు కేటాయించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.


ఇక పెద్ద సినిమాల కష్టాలు వాటికి ఉన్నాయని కార్తీక్ సుబ్బరాజ్ చెప్పాడు. కనీసం మూడు నెలల ముందు పెద్ద సినిమాలు సెన్సార్ కార్యకలాపాలను పూర్తి చేసుకోవాలని చెబుతున్నారని, కానీ ఇది అయ్యే పని కాదని ఆయన అన్నారు. ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించడం కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమయంలో సాంకేతిక నిపుణులపై ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. సెన్సార్ బోర్డ్, నిర్మాతలు కలిసి కూర్చుని ఈ విషయాలను సరిచేసుకోవాలని లేకపోతే పండగలకు రావాల్సిన సినిమాల విడుదల వాయిదా పడి సినిమా ఇండస్ట్రీని చంపేస్తుందని అన్నాడు. ఇప్పుడున్న క్లిష్టసమయంలో ఫ్యాన్ వార్స్ ను, రాజకీయ కారణాలను, వ్యక్తగత ఎజెండాలను, వ్యతిరేక ప్రచారాలను పక్కన పెట్టి సినిమా రంగంలోని అందరూ ఒక త్రాటిపైకి రావాలని, అప్పుడు సినిమా కళను రక్షించగలమని కార్తీక్ సుబ్బరాజ్ అభిప్రాయపడ్డాడు.

Updated Date - Jan 08 , 2026 | 12:45 PM