Toxic: 2000 కోట్లు.. పెద్ద మాటే
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:19 PM
కేజీఎఫ్ ఫ్రాంచైజ్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, కన్నడ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన కథానాయకుడు రాకింగ్ స్టార్ యష్. కెజిఎఫ్ 2 వంటి మైలురాయి లాంటి విజయం తర్వాత ఆయన నటిస్తున్న అత్యంత భారీ, ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్
కేజీఎఫ్ ఫ్రాంచైజ్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, కన్నడ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన కథానాయకుడు రాకింగ్ స్టార్ యష్. కెజిఎఫ్ 2 వంటి మైలురాయి లాంటి విజయం తర్వాత ఆయన నటిస్తున్న అత్యంత భారీ, ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups). జాతీయ పురస్కార గ్రహీత గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆగస్టు 26న టాక్సిక్ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడంతో, ప్రమోషన్లను అత్యంత వేగవంతం చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో టాక్సిక్ ప్రీ-రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ కీలక వేడుకకు లేడీ సూపర్ స్టార్ నయనతార మినహా కథానాయకుడు యష్, కియారా అద్వానీ, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ హాజరయ్యారు. వేలాది మంది విద్యార్థులు, అభిమానుల కోలాహలంతో ప్రాంగణం అంతా సందడిగా మారింది.
ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన దిల్ రాజు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమా సంగీత దర్శకుల్లో ఒకరైన విశాల్ మిశ్రా తనతో చెబుతూ.. టాక్సిక్ చిత్రం ఖచ్చితంగా రూ. 2000 కోట్ల వసూళ్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిపారు. అదే నమ్మకాన్ని దిల్ రాజు కూడా వేదికపై వ్యక్తపరిచారు. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ రికార్డును అందుకోవడం చాలా పెద్ద సవాలుతో కూడుకున్న విషయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా పిల్లల కోసం కాదని, కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ తెలపడమే కాకుండా సెన్సార్ బోర్డు కూడా A సర్టిఫికేట్ జారీ చేసింది.
కుటుంబ ప్రేక్షకులు, పిల్లల మద్దతు లేకుండా కేవలం ఒక వర్గం ప్రేక్షకుల ఆధారంగా ఈ స్థాయి ఫీట్ సాధించాలంటే ధురంధర్, పుష్ప చిత్రాలను మించిన పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా బుకింగ్స్ భారీగా రావాలి. ఎటువంటి ఫ్రాంచైజ్ క్రేజ్ లేకుండా కేవలం కంటెంట్ నమ్ముకుని వస్తున్న ఈ చిత్రానికి కర్ణాటక, బాలీవుడ్‌లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఏ సర్టిఫికేట్ కంటెంట్‌తో యష్, గీతూ మోహన్‌దాస్‌లు కనుక ఈ మార్కును సాధిస్తే భారతీయ చిత్రసీమలో అదొక కొత్త చరిత్రగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. కానీ, ఇది చాలా కష్టమని పలువురు చెప్పుకొస్తున్నారు.