రేణుకాస్వామి హత్యకేసు.. మరో సాక్షి యూటర్న్

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:27 PM

రేణుకాస్వామి హత్యకేసులో మరో ప్రత్యక్షసాక్షి కోర్టులో మాట మార్చారు. మరోవైపు పవిత్రాగౌడ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.

Darshan

క‌న్న‌డ న‌టుడు ద‌ర్ష‌న్ (Darshan Thoogudeepa) రేణుకాస్వామి హత్యకేసు విచారణలో ప్రాసిక్యూషన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ప్రత్యక్షసాక్షుల్లో (Witness) ఒకరు కోర్టులో మాట మార్చారు. పట్టణగెరె షెడ్‌లో జరిగిన ఘటనకు తాను ప్రత్యక్షసాక్షిని కాదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న నటి పవిత్రాగౌడ (Pavithra Gowda) బెయిల్ కోసం మరోసారి సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. అయితే ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసు విచారణ బెంగళూరులోని 59వ సీసీహెచ్ కోర్టులో కొనసాగుతోంది. మంగళవారం జరిగిన విచారణకు పట్టణగెరె షెడ్‌లో పనిచేసే మల్లికార్జున హాజరయ్యారు. అయితే కోర్టులో వాంగ్మూలం ఇచ్చే సమయంలో షెడ్‌లో ఏం జరిగిందో తాను చూడలేదని తెలిపారు. గతంలో పోలీసుల విచారణ సందర్భంగా మల్లికార్జున ఇచ్చిన వాంగ్మూలానికి, ప్రస్తుతం కోర్టులో చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆయనను ప్రతికూల సాక్షిగా (హోస్టైల్ విట్‌నెస్) ప్రకటించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఇప్పటికే ఈ కేసులో సెక్యూరిటీ గార్డు నరేంద్రసింగ్ కూడా నిందితులను గుర్తుపట్టలేనని కోర్టుకు వెల్లడించారు. తాజాగా షెడ్‌లో పనిచేసే మల్లికార్జున సైతం అదే తరహాలో వాంగ్మూలం ఇవ్వడం విచారణలో చర్చనీయాంశంగా మారింది. వరుసగా సాక్షులు తమ గత వాంగ్మూలాలకు భిన్నంగా మాట్లాడుతుండటం ప్రాసిక్యూషన్‌కు సవాలుగా మారింది.

మరోవైపు, రేణుకాస్వామి హత్యకేసులో జైలులో ఉన్న నటి పవిత్రాగౌడ మరోసారి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని, సుప్రీంకోర్టు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతో ఏడాదికి పైగా జైలులోనే ఉంటున్నానని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

అయితే పవిత్రాగౌడకు బెయిల్ ఇవ్వకూడదని సిట్ తరఫు న్యాయవాది ప్రసన్నకుమార్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు. ఒకవైపు కేసులో సాక్షులు మాట మార్చుతుండగా, మరోవైపు పవిత్రాగౌడ బెయిల్ కోసం న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. దీంతో రేణుకాస్వామి హత్యకేసు విచారణ మరోసారి ఆసక్తికరంగా మారింది.

Updated Date - Nov 25 , 2026 | 06:37 PM