TVK Vijay: విజయ్‌కు సినీ తారల మద్దతు.. గవర్నర్ తీరుపై కమల్ హసన్, ప్రకాశ్ రాజ్, విశాల్ ఫైర్
ABN , Publish Date - May 08 , 2026 | 06:34 AM
తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, విశాల్, ఖుష్బూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమిళనాడులో టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ (Vijay) కు మద్దతుగా సినీ తారలు గొంతు విప్పారు. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, కానీ గవర్నర్ అలా చేయకపోవడాన్ని 'ఎక్స్' వేదికగా వారు నిరసించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, విజయ్ విషయంలో గవర్నర్ తీరు సరికాదని, తమిళ ప్రజల తీర్పును అవమానించడమే అవుతుందని మక్కల్ నీదిమయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ పేజీలో ఓ సందేశం పోస్టు చేస్తూ శాసనసభ ఎన్నికలో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజారీటీ ఏ పార్టీకి రాలేదని, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇలాంటి తీర్పు ఎప్పుడు రాలేదన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. డీఎంకే అధ్యక్షుడు, తన సోదరసమానుడు స్టాలిన్ బాధ్యతాయుత మైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించడం ఆయన రాజకీయ పరిణతిని వ్యక్తం చేస్తోందన్నారు. ఇక ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం 108 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నా గవర్నర్ ఆహ్వా నించకపోవడం గర్హనీయమన్నారు. అంతే కాకుండా ఎన్నికైన 233 మంది ప్రజా ప్రతినిధులు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉందని, ఈ పరిస్థితులలో గవర్నర్ అనవసరమైన కాలయాపన చేయడం రాష్ట్రా నికే అవమానమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కమల్ ఆ ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి పూర్తి హక్కు ఉన్నదని నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. ఆ హక్కును తీసివేసేలా గవర్నర్ ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడులో గవర్నర్ పాలన కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని హీరో విశాల్ (Vishal) వ్యాఖ్యానించారు. టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి నప్పటికీ గవర్నర్ ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ (Khushboo) ఓ ప్రకటన చేస్తూ. 'తమిళనాడు ప్రజలు టీవీకే నాయకుడు విజయ్‌ను తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మనం దానిని తప్పక అంగీకరించాలి' అని పేర్కొన్నారు.