Jiiva: జీవాకు కాలం కలిసొచ్చింది

ABN , Publish Date - Jan 17 , 2026 | 07:59 PM

హీరో జీవా (Jiiva) అనగానే వెంటనే ముఖం గుర్తుకు రాకపోయినా, రంగం’ హీరో అంటే మాత్రం చాలామంది టక్కున పట్టేస్తారు. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్‌బి చౌదరి తనయుడిగా తమిళంలో నిలకడగా సినిమాలు చేస్తూనే ఉన్న జీవాకు, ఇటీవలి కాలంలో తెలుగులో మాత్రం పెద్దగా డబ్బింగ్ అవకాశాలు రావడం లేదు.



హీరో జీవా (Jiiva) అనగానే వెంటనే ముఖం గుర్తుకు రాకపోయినా, రంగం’ హీరో అంటే మాత్రం చాలామంది టక్కున పట్టేస్తారు. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్‌బి చౌదరి తనయుడిగా తమిళంలో నిలకడగా సినిమాలు చేస్తూనే ఉన్న జీవాకు, ఇటీవలి కాలంలో తెలుగులో మాత్రం పెద్దగా డబ్బింగ్ అవకాశాలు రావడం లేదు. మార్కెట్ కొంత తగ్గడం, తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పలుచబడటం తో హక్కులు కొనుగోలు చేసే వారు తగ్గిపోయారు. అయితే తాజాగా విడుదలైన ‘తలైవర్ తంబీ తలైమాయిల్’ (Thalaivar Thambi Thalaimaiyil) మాత్రం అనూహ్యంగా ట్రెండ్ అవుతోంది. 'జన నాయకుడు' వాయిదా పడటంతో హడావుడిగా సెన్సార్ పూర్తి చేసి, పొంగల్ రేసులో కార్తీ నటించిన ‘వతియార్ (అన్నగారు వస్తారు)’ సినిమాకు పోటీగా నిలిపారు. ఆశ్చర్యకరంగా కార్తీ చిత్రానికి ఆశించిన స్పందన రాకపోగా, జీవా సినిమా మాత్రం హిట్ దిశగా దూసుకుపోతోంది. బుక్‌మైషోలో గంటకు సగటున 7 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాపై ఉన్న బజ్‌కు నిదర్శనం. వారం రోజుల్లోనే పెట్టుబడి తిరిగి వస్తుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

కథ విషయానికి వస్తే… జీవరత్నం అనే వ్యక్తి ఓ చిన్న గ్రామానికి పంచాయితీ ప్రెసిడెంట్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఓటూ కీలకంగా మారుతుంది. అదే సమయంలో ఇళవరసి కూతురు పెళ్లి జరుగుతుండగా, తంబీ రామయ్య తండ్రి మరణిస్తాడు. శవయాత్ర విషయంలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం ఊరంతా ఉద్రిక్తతకు దారి తీస్తుంది. ఈ సమస్యను ప్రెసిడెంట్‌గా జీవరత్నం ఎలా పరిష్కరిస్తాడు అనేదే ‘తలైవర్ తంబీ తలైమాయిల్’ కథ. కథ లైన్ వినడానికి సీరియస్‌గా అనిపించినా, దర్శకుడు నితీష్ సహదేవ్ దాన్ని పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. సున్నితమైన అంశాన్ని హాస్యంతో, హృద్యంగా డీల్ చేయడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదట్లో ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలనే ఆలోచన లేకపోయినా, ఇప్పుడు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి అనువాదంపై ఆలోచిస్తున్నారని సమాచారం. గ్రామీణ నేపథ్యంతో సాగిన ఈ చిత్రం కోలీవుడ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ‘పొంగల్ విన్నర్ ఇదే’ అనే ప్రచారం చెన్నై మీడియా వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Updated Date - Jan 17 , 2026 | 10:19 PM